బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 27, 2020 , 00:47:53

కొవిడ్‌ లక్షణాలున్న వారిని ఆర్‌ఎంపీలే గుర్తించాలి

కొవిడ్‌ లక్షణాలున్న వారిని ఆర్‌ఎంపీలే గుర్తించాలి

  • సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు రెఫర్‌ చేయాలి
  • రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి
  • ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ముఖ్య నేతలతో సమావేశం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ / షాబాద్‌ : కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని ఇక నుంచి ఆర్‌ఎంపీలు, పీఎంపీలే గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు రెఫర్‌ చేయాలని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాకు చెందిన ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది అవగాహ న లేకపోవడంతో కొవిడ్‌-19 బారిన పడుతున్నారని చెప్పారు. సరైన వైద్యం అందకపోవడంతో మృతి చెందుతున్నారన్నారు. అనుమానంతో లేనిపోని పరీక్షలు చేయించుకుని ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా మీరందరూ సలహాలు ఇవ్వాలని, వాళ్లకు ధైర్యం చెప్పాలని సూచించారు. ఇప్పటి నుంచి ప్రతి పేషెంటు ముందుగా మిమ్మల్ని సంప్రదిస్తారు, కాబట్టి కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు పంపించాలన్నారు.

ప్రభుత్వ దవాఖానల్లో వారం రోజుల నుంచి ఉచితంగా కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పరీక్షల కోసం వెళ్లే ప్రతి ఒక్కరిని దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు పంపించాలని చెప్పారు. దీంతో పాటు ప్రతి రోజూ వారి వివరాలను సేకరించి, దగ్గర్లోని మెడికల్‌ ఆఫీసర్‌కి వాట్సాప్‌ ద్వారా అందజేయాలన్నారు. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి కొవిడ్‌ -19 గురించి ఎంతో పోరాటం చేస్తుందన్నారు. ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని, అయినా ఈ మధ్య కాలంలో చాలా మంది కొవిడ్‌ -19 బారిన పడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కొవిడ్‌ -19  కేసులు పెరుగుతున్నట్లు ఆమె వివరించారు. ఈరోజూ నుంచి ప్రభుత్వం చేసే పోరాటంలో ప్రతి ఆర్‌ఎంపీ సహకారం ఉండాలన్నారు.  కొవిడ్‌ బారిన పడిన వాళ్ల ప్రాణాలు కాపాడడానికి మీ తరుఫు నుంచి కృషి చేయాలన్నారు. ఇలాంటి చక్కటి అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఆర్‌ఎంపీ, పీఎంపీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.