మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Jul 27, 2020 , 00:03:10

నిధులొచ్చాయ్‌..!

నిధులొచ్చాయ్‌..!

  • 15వ ఆర్థిక  సంఘం నుంచి రూ.13కోట్ల 45లక్షలు విడుదల 
  • జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.12.11కోట్లు 
  • మండల పరిషత్‌లకు రూ.89.65లక్షలు
  • జిల్లా పరిషత్‌కు రూ.44.82లక్షలు
  • అభివృద్ధి పనుల్లో పెరుగనున్న వేగం

గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర, కేంద్ర  ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు, అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం  విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాకు ఈ నిధుల కింద 13.45 కోట్లు వచ్చాయి. ఇందులో 560 గ్రామ పంచాయతీలకు  రూ.12కోట్లకు పైగా కేటాయించింది. మిగతా మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, జనరల్‌ ఫండ్‌ కింద ఇవ్వనున్నది. గతంలో కేవలం గ్రామాలకు నేరుగా నిధులు అందేవి. ఈసారి మండల, జిల్లా పరిషత్‌లకూ నిధులు వస్తున్నాయి. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులు విడుదలయ్యాయి.  మొత్తం నిధుల్లో 85 శాతం గ్రామాలకు,10 శాతం మండల పరిషత్‌లకు, 5 శాతం జిల్లా పరిషత్‌లకు అందనున్నాయి.  ప్రతినెలా ఈ నిధులు విడుదల చేస్తుండడం,  వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేస్తుండడంతో స్థానిక సంస్థల అభ్యున్నతికి దోహదం చేస్తున్నాయి. రంగారెడ్డి,నమస్తే తెలంగాణ :  స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.13.45కోట్లు విడుదలయ్యాయి.   అన్ని శాఖలకు కలిపి కేటాయింపులు జరిగాయి. ఇందులో జనరల్‌ ఫండ్‌ కింద రూ.1,01,44,000, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.23,30,800, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.9,72,500లు (జడ్పీ,ఎంపీపీలకు)మంజూరయ్యాయి. ఇవే కాకుండా జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలకు రూ.12,10,98,800 విడుదలయ్యాయి.వీటిని గ్రామ పంచాయతీలతో  పాటు జిల్లా,మండల పరిషత్‌లకు కేటాయించారు. 2011 జనాభా ప్రాతిపదికన జనరల్‌,ఎస్సీ,ఎస్టీ కాంపోనెంట్ల వారీగా గ్రాంట్‌ మంజూరైంది. జడ్పీకి 5శాతం,మండల పరిషత్‌లకు 10శాతం చొప్పున నిధులు కేటాయించారు.

ఏడాది కాలంలో రూ.30 లక్షలపైగా ..

జిల్లా పరిషత్‌ సాధారణ నిధుల నుంచి గత ఏడాది కాలంలో రూ.30లక్షలకు పైగా ఒక్కో జడ్పీటీసీకి కేటాయించారు. దానికి గాను సభ్యులు ప్రతిపాదనలను సమర్పిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. గతంలో ఫార్మేషన్‌ రోడ్లకు, సివిల్‌ తదితర పనులకు జడ్పీటీసీ సభ్యులకు బీఆర్‌జీఎఫ్‌ నిధులు కేటాయించేవారు.వీటిని గతంలోనే రద్దు చేశారు.

గతంలో నేరుగా పంచాయతీలకే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల ముంగిటే సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందులో భాగంగా జిల్లాలు, మండలాల విభజనతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులన్నీ నేరుగా గ్రామ పంచాయతీలకే అందాయి. వాటిలో జడ్పీ, మండల పరిషత్‌లకు కేటాయించలేదు.దీంతో వారు కనీసం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు కొన్ని చోట్ల భవనాలకు అద్దెకూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులతో స్థానిక సంస్థలకు బలం చేకూర్చినట్టయ్యింది.

కాంపోనెంట్‌తో తగ్గిన నిధులు 

 ఇంతవరకు గత ఏప్రిల్‌,మే,జూన్‌కు సంబంధించి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు అందాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. ఇందులో 5శాతం జడ్పీకి, 10శాతం మండల పరిషత్‌లకు ప్రకటించింది. అందులో జనరల్‌,ఎస్సీ,ఎస్టీ,కాంపోనెంట్‌ కలిపి రావడంతో జడ్పీ ,మండల పరిషత్‌లకు నిధులు తగ్గాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు 50శాతం,మండల పరిషత్‌లకు 30,జిల్లా పరిషత్‌కు 20 శాతం కేటాయించారు. అయితే ఈ నిధులు దారిమళ్లీస్తున్నారని 14వ ఆర్థిక సంఘం సిఫారస్సు మేరకు అప్పట్లో 100శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయించారు. ప్రస్తుతం విడుదలవుతున్న 15వ ఆర్థిక సంఘం నిధులను ఆయా రాష్ర్టాల అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం కేటగిరిల వారీగా ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా గ్రామ పంచాయతీలకు 85శాతం,మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌ 5 శాతం నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. 

స్థానిక సంస్థల బలోపేతానికి..

 

స్థానిక సంస్థల పరిపుష్టికి ప్రభుత్వం పాటుపడుతున్నది. జిల్లా,మండల పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయం. ప్రతినెలా ఈ నిధులు విడుదల కానుండడంతో అభివృద్ధి పనుల్లో వేగం పెరుగనున్నది. 

-డాక్టర్‌ తీగల అనితారెడ్డి,జడ్పీ చైర్‌ పర్సన్‌