ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jul 26, 2020 , 00:58:46

నియోజకవర్గ అభివృద్ధికి కృషి..

నియోజకవర్గ  అభివృద్ధికి కృషి..

  • రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు
  • పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి
  • కల్వకుర్తి  ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
  • కడ్తాల్‌ మండలం  చల్లంపల్లిలో అభివృద్ధి పనుల పరిశీలన
  • ఆమనగల్లు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో అధికారులతో సమీక్ష సమావేశం
  • కల్వకుర్తి ఎత్తిపోతల పనులను  త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల (కేఎల్‌ఐ) అసంపూర్తి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కల్వకుర్తి ఎత్తిపోతల (డీ-82) పథకంలో భాగంగా ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాల్లో కొనసాగుతున్న ఎత్తిపోతల అసంపూర్తి పనులపై సమీక్షించారు.  సీఎం కేసీఆర్‌ కేఎల్‌ఐకి కేటాయించిన నిధుల వివరాలు, కేటాయింపు, పనుల పురోగతి,  జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలంలోని నాగిళ్ల వరకు కొనసాగుతున్న కాల్వల పనులు, రైతులకు చెల్లించే పరిహారం, గుత్తేదారులకు కేటాయించిన పనుల విషయాలను అధికారులతో ఆయన చర్చించారు. కేఎల్‌ఐ పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఈ అనంతరెడ్డి, ఎస్‌ఈ అంజయ్య, ఈఈ శ్రీకాంత్‌, డిప్యూటీ డీఈలు దేవన్న, షర్మిల, ఏఈలు చంద్రకాంత్‌, లలిత, శశికళ, ఇఫ్తాకర్‌, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

కడ్తాల్‌లో పలు అభివృద్ధి పనులు..

కడ్తాల్‌: నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని, ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు మారిపోయాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శనివారం మండలంలోని చల్లంపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్‌ కృష్ణయ్య యాదవ్‌, ఉప సర్పంచ్‌ జైపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, బీఎంసీ (మినీ పాలశీతలీకరణ కేంద్రం) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎన్ని ఆటంకాలు, అవరోధాలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్నారన్నారు.   

రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల ప్రజల చిరకాల స్నప్నమైన, కడ్తాల్‌- తలకొండపల్లి మధ్య ఉన్న రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ఎండీఆర్‌ నిధులు రూ.20.40 కోట్లు, కడ్తాల్‌ నుంచి చల్లంపల్లి, సాలార్‌పూర్‌ గ్రామాల మీదుగా పడకల్‌ గేట్‌ వరకు రోడ్డు (రెన్యువల్‌) అభివృద్ధికి ఎస్‌ఆర్‌ నిధులు రూ.1.60 కోట్లు మంజూరు చేసిందన్నారు. మంత్రి సబితారెడ్డి రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కడ్తాల్‌- తలకొండపల్లి డబుల్‌ రోడ్డు నిర్మాణంతో రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలకు, కడ్తాల్‌, తలకొండపల్లి, మిడ్జిల్‌, కేశంపేట్‌, షాద్‌నగర్‌ మండలాలకు రాకపోకలు సులువవుతాయన్నారు. రోడ్డు విస్తరణతో కడ్తాల్‌, తలకొండపల్లి మండలాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్‌ నుంచి కడ్తాల్‌ వరకు ఇప్పుడున్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని, ఆరు లేన్లుగా మార్చడానికి ఎన్‌హెచ్‌ఏఐకి ప్రతిపాదనలు పంపామన్నారు. కడ్తాల్‌, ఆమనగల్లు, వెల్దండ మండల కేంద్రాల్లో త్వరలో సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు హరిచంద్‌నాయక్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, జైపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ వీరయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు రమేశ్‌, నాయకులు నర్సింహ, శ్రీనివాస్‌గుప్తా, లాయక్‌అలీ, రాంచంద్రయ్య, శంకర్‌, రాజేందర్‌యాదవ్‌, యాదయ్య, ఇర్షాద్‌, భిక్షపతియాదవ్‌, వెంకటేశ్‌యాదవ్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ అనూష పాల్గొన్నారు.