బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 24, 2020 , 00:06:45

ఒకటో తేదీనే జీతాలు

ఒకటో తేదీనే జీతాలు

  • మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌  సిబ్బంది ఖాతాల్లో జమ 
  • ఉత్తర్వులు   జారీ చేసిన ప్రభుత్వం
  • తక్షణమే అమలుకు ఆదేశం
  • రంగారెడ్డి జిల్లాలో 3 కార్పొరేషన్లు, 
  • 12 మున్సిపాలిటీలు
  • 2200పైగా  సిబ్బందికి మేలు 
  • హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది

మున్సిపాలిటీల్లో పని చేస్తున్న  ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది కల నెరవేరింది. ఎన్నో ఏండ్లుగా జీతాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురందించింది. ఇక నుంచి ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వారి వేతనాలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించగా.. వారు మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై దొరికినచోట అప్పులు చేసి బతుకుబండిని లాగుతున్నారు. ఇది గుర్తించిన ప్రభుత్వం సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వెంటనే ఉత్తర్వుల అమలుకు మున్సిపాలిటీలను ఆదేశించింది. కాగా, జిల్లాలో మొత్తం మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అన్నివిభాగాల్లో కలిపి 2200 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

 

రంగారెడ్డి,నమస్తే తెంగాణ : మున్సిపాలిటీల్లో పనిచేస్తు న్న పొరుగు సేవలు, ఒప్పంద కార్మికులు, సిబ్బందికి ప్రభు త్వం తీపి కబురందించింది. ఇక నుంచి ప్రతినెలా ఒకటో తేదీనే వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు ఆర్‌వోసీ నం బర్‌ 207890/2020-హెచ్‌2 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులు మున్సిపాలిటీలకు అందాయి. ఈ ఆదేశాలను సత్వ ర అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంచాలకులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్‌ నెరవేరడంతో కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది. అయితే జిల్లా లో 3 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలుండగా.. అన్ని రకాల సిబ్బంది 2200 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. 

తీరనున్న ఇబ్బందులు..

పురపాలక సంఘాలు, కార్పొరేషన్లల్లో పనిచేసే పొరుగు సేవల, ఒప్పంద కార్మికుల వేతనాలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించగా.. వారు మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. దీంతో కార్మికులు, సిబ్బంది తీవ్ర ఆర్థి క ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కొందరు కార్మికులు పిల్లల చదువు రుసుం, కుటుంబ అవసరాలకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నానా కష్టాలు అనుభవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ సంస్థల సిబ్బంది కార్మికులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేతనాల్లో కోత పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇప్పటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీ కే జీతాలు చెల్లించనుండడంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. 

హాజరు నమోదులో జాప్యం తగదు..

కార్మికుల హాజరు నమోదుపై అలసత్వం వహించొద్దని, పొరుగుసేవల కింద చెల్లించే రూ.12 వేల వేతనం ఒకటో తేదీన అం దేలా చర్యలు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రతి నెలా 25 నాటికి హాజరు పట్టిక సిద్ధం  చేయాలని అధికారులు సూచించారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు చెల్లింపుల్లో అలసత్వం వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్‌ కమిషనర్లు ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. 

కార్మికులకు పీపీఈ కిట్లు 

కొవిడ్‌-19 వ్యాప్తి తరుణంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) పంపిణీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తప్పకుండా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు ప్రభుత్వం సూచించిన ఏజెన్సీల నుంచి వాటిని తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఆదేశాలు అమలు చేస్తాం..

- జైత్రాంనాయక్‌, శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌  

ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పొరుగు సేవల కార్మికులు, సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలు అందించేందుకు తగిన చర్య లు చేపట్టాం. అలాగే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లాలి. శంకర్‌పల్లి మున్సిపల్‌లో 88 మంది సేవలందిస్తున్నారు.

సకాలంలో జీతాలివ్వడం సంతోషమే

- కిషన్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

పొరుగు సేవల సిబ్బందికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం సం తోషం. కానీ గతంలో పంచాయతీల నుంచి అప్‌గ్రేడ్‌ అయినవాటికి మున్సిపల్‌ జీతాలు ఇవ్వడంలేదు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం జీతాలివ్వాలి. బడ్జెట్‌ లేదని చెబుతూ సిబ్బందికి జీతాల్లో కోత విధిస్తున్నారు. జీవో నెం 14 ప్రకారం ఏ గ్రేడ్‌ సిబ్బందికి రూ.17500, బీ గ్రేడ్‌ రూ.15000, సీ గ్రేడ్‌ వారికి రూ.12000 జీతాలు చెల్లించాలి. బిల్లు కలెక్టర్లు, ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, ఆటోమెన్లు, స్వీపర్‌ ఇలా అందరికీ న్యాయం చేయాలి.