మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 22, 2020 , 23:29:10

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య

 సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య

  • ప్రైవేట్‌కు దీటుగా విద్యా ప్రమాణాలు పెంపు
  • విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు
  • మండలాల ఎంపీడీవోలు, ఎంఈవోలు 

షాబాద్‌ : సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈవో శంకర్‌రాథోడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం వద్ద బుధవారం అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కరోనా వైరస్‌ కారణం గా ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకోలేదని, ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ప్రారంభిస్తామని చెప్పారు. మండలంలోని 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత, 41 ప్రాథమిక పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించినట్లు తెలిపారు. 

పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి 

చేవెళ్ల : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మండల విద్యాధికారి అక్బర్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంపీటీసీలు వసంతం, రాములుతో కలిసి ఆయన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్బర్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీను, వార్డు సభ్యుడు మల్లారెడ్డి, ప్రధానోధ్యాయుడు ఖాజా పాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాలు పంపిణీ

శంకర్‌పల్లి టౌన్‌ : ప్రభుత్వం మంజూరు చేసిన పాఠ్యపుస్తకాలను ఎంఈవో సయ్యద్‌ అక్బర్‌, సీఆర్‌పీలు మండలంలోని జన్వాడ జడ్పీహెచ్‌ఎస్‌, మహాలింగాపూర్‌ పాఠశాలలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 56 పాఠశాలలు ఉండగా ఇప్పటి వరకు 23 వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. కార్యక్రమం లో సీఆర్‌పీలు శ్రీవిద్య, ప్రభాకర్‌రెడ్డి, ఎంఐఎస్‌ శ్రీహరి, లక్ష్మి పాల్గొన్నారు.

విద్యార్థులకు అందజేత

కొందుర్గు : మండల కేంద్రంలోని బాలికల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సంగీత మాట్లాడుతూ 6, 7 తరగతుల విద్యార్థులకు పుస్తకాలు అందజేశామన్నారు. కరోనా కారణంగా బడులు తెరువలేని పరిస్థితి ఉన్నదని, విద్యార్థులకు పుస్తకాలు ఇస్తే కనీసం ఇంటి వద్దనైనా చదువుకునేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఉన్నారు.