బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 22, 2020 , 23:17:58

‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తి చేసేందుకు సీఎం కృషి

‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తి చేసేందుకు సీఎం కృషి

 • విద్యారంగంలో రాష్ర్టానికి ఆదర్శంగా నిలుద్దాం
 • దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని  విధంగా గురుకులాల ఏర్పాటు
 • పౌష్టికాహారం, మెరుగైన విద్యను అందిస్తున్నాం
 • సర్కారు బడులను మరింత బలోపేతం చేస్తాం
 • నిర్వహణ బాధ్యతలు పంచాయతీలు చేపట్టాలి
 • పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలో పది రోజుల్లో నిర్ణయం 
 • త్వరితగతిన రైతు వేదికల నిర్మాణాలు
 • కొడంగల్‌పై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ...
 • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
 • మొయినాబాద్‌, కొడంగల్‌ మండలాల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
 • రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. బుధవారం మొయినాబాద్‌ మండలం తోలుకట్టా గ్రామంలో జడ్పీఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకుల పాఠశాలల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గురుకులాల్లో సన్నబియ్యంతో సంపూర్ణ భోజన సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. పరీక్షల్లో విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి గురుకులాల్లో చేర్పిస్తున్నారని అన్నారు.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై పదిరోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మన బడి-మన గుడి అనే భావనతో పాఠశాలల నిర్వహణ బాధ్యతలు సర్పంచ్‌లు తీసుకుని భవనాలకు రంగులు చేయించడం, మంచి నీటి నిర్వహణ, హరిత హారం వంటి పనులు చేయించడానికి కృషి చేయాలని సూచించారు. అలాగే వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో బీటీ రోడ్ల ప్రారంభోత్సవంతో పాటు రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రైతు అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతు బంధు, రైతు బీమా,  రైతు వేదికలు, కలాల నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నట్లు తెలిపారు. కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారని, నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 

- మొయినాబాద్‌/ కొడంగల్‌/ దౌల్తాబాద్‌


మొయినాబాద్‌ : రాష్ట్రంలో విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలం పరిధి తోలుకట్టా గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం జారీ చేసిన పాఠ్య పుస్తకాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తో కలిసి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యావంతులను చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌  ప్రతి మండలానికి   గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. తోలుకట్టా ప్రాథమిక పాఠశాలలో 180 మంది విద్యార్థులు విద్యనభ్యసించడం అభినందనీయమన్నారు. రూ.కోటితో పాఠశాలకు ఆధునిక భవనం కట్టిస్తామని దాతలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. తోలుకట్టా పాఠశాల రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు పాఠశాలలను ప్రారంభించలేదన్నారు. ఈ విషయమై పది రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మండల విద్యాధికారి వెంకటయ్య తది తరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే  యాదయ్య

ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తోలుకట్టా ప్రభుత్వ పాఠశాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని దాతలు ముందుకు రావడం గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ సంచాలకుడు దేవసేన, ఉపసంచాలకుడు శ్రీహరి, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి,ఆర్డీవో వేణుమాధవరావు, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, స్థానిక సర్పంచ్‌  శ్రీనివాస్‌, ఎంపీటీసీ రవీందర్‌, ఉపసర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, తాసిల్దార్‌ అనిత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈవో వెంకటయ్య, ఎంపీవో యాదగిరిగౌడ్‌,  హెచ్‌ఎం రేణుక, ఆర్‌ఐ రోజా, సర్పంచులు నరోత్తంరెడ్డి, వర్ధ్దన్‌, మనోజ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్‌ జబ్బార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు  జయవంత్‌, నర్సింహారెడ్డి, అంజిరెడ్డి, అంజయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

అటవీభూమిలో మొక్కల పెంపకం భేష్‌ 

 పరిగి : మొక్కల పెంపకం బాగుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితా రెడ్డి అభినందించారు. హరితహారంలో భాగంగా పరిగి మండలం సాలిప్పలబాట   గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ భూమిలో నాటిన మొక్కలను  స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని మొక్కలు నాటారని మంత్రి అడుగగా 50 ఎకరాలలో 35వేల పైచిలుకు మొక్కలు నాటామని,  ప్రతి మొక్క బతికిందని అటవీ శాఖ రేంజర్‌ అబ్దుల్‌హాయ్‌ తెలిపారు. మొక్కలను స్వయంగా మంత్రి పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నార్మాక్స్‌ మాజీ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్‌  పాల్గొన్నారు. 

 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తికి చర్యలు

కొడంగల్‌/దౌల్తాబాద్‌ : రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని  విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి  తెలిపారు.   కొడంగల్‌ నియోజకవర్గం దౌల్తాబాద్‌ మండలంలో బీటీ రోడ్ల ప్రారంభోత్సవంతో పాటు రైతు వేదిక నిర్మాణాలకు వారు శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సాగునీటికోసం వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు.  త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని  పూర్తి చేయాలన్నదే సీఎం లక్ష్యంగా పేర్కొన్నారు. కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారని, అందుకే నియోజకవర్గ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం పలు  గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. కుదురుమల్ల, నందారం, గోకాఫసల్‌వాద్‌ గ్రామాల్లో రూ.36లక్షలతో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రూ.225కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.   వికారాబాద్‌ జిల్లాలో 5 లక్షల 90వేల పై చిలుకు పుస్తకాలను 92 వేల795 మంది విద్యార్థులకు అందివ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రమోద్‌రావు, నరోత్తంరెడ్డి, భగవంతు, మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో పాటు అధికారులు తాసిల్దార్‌ వెంకటేశ్‌, డీఈవో రేణుక, ఎంపీడీవో తిరుమలస్వామి పాల్గొన్నారు.