గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 23, 2020 , 00:09:45

కార్గోతో కాసులు

కార్గోతో కాసులు

  • ఆర్టీసీకి పెరిగిన రాబడి
  • ఒక్కో వాహనానికి రోజుకు రూ.20వేల ఆదాయం
  • ్రగ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల్లో 85 సర్వీసులు
  • ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌, ట్రాకింగ్‌తో పెరుగుతున్న ఆదరణ
  • రాఖీల కొరియర్‌కు ‘సురక్ష’ సర్వీస్‌
  • ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలోనూ సేవలు
  • బుకింగ్‌ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

నష్టాల కష్టాల నుంచి ఆర్టీసీ బయట పడుతున్నది. సీఎం కేసీఆర్‌ చొరవ, ఆర్టీసీ యాజమాన్యం వినూత్న ఆలోచనతో ప్రారంభించిన కార్గో సేవలు కాసులు కురిపిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల్లో 85 బస్సులను కార్గో సేవలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో ఎస్‌ఎంఎస్‌, ట్రాకింగ్‌ లాంటి సదుపాయాలు కల్పించారు. దీంతో కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు ఆదరణ పెరుగుతున్నది. ఒక్కో కార్గోకు రోజుకు సుమారుగా రూ.20 వేల ఆదాయం వరకు వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. పార్సిల్‌ విలువను బట్టి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఎఫ్‌సీఐ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లాంటి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఆర్టీసీ కార్గో, కొరియర్‌ సేవలపై మొగ్గు చూపుతున్నారు. వీటికోసం పలుచోట్ల ప్రత్యేక బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ప్రజలు మొగ్గు చూపకపోవడంతో రాఖీలు పంపేందుకు ప్రత్యేకంగా సురక్ష పేరిట కొరియర్‌ సౌకర్యం కల్పించారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌, చేవెళ్ల డివిజన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. 


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న సేవలతో ప్రజలకు మరింత చేరువవుతున్నది. గతంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితమైన ఆర్టీసీ .. ఇప్పుడు సరుకు రవాణా సేవల్లోనూ అడుగుపెట్టింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు యాజమాన్యం కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించింది. కార్గో సేవల ద్వారా నష్టాలను పూడ్చుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావించింది. జిల్లాలోని పలు డిపోల్లో సరుకు రవాణా సేవల కేంద్రాలను ప్రారంభించింది. మరికొన్ని చోట్ల త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. అధికారులు కొన్ని బస్సులను కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.  రంగారెడ్డి, హైదరాబాద్‌ రీజియన్‌లోని పలు డిపోల్లో కార్గో బస్సులను సిద్ధం చేశారు. రంగారెడ్డి రీజియన్‌లోని హైదరాబాద్‌-1, 2, 3 డిపోలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ), రాజేంద్రనగర్‌, ఫరూఖ్‌నగర్‌, మహేశ్వరం, ఫలక్‌నుమ, మోహిదీపట్నం, హయత్‌నగర్‌-1,2, బండ్లగూడ, మిధాని, ఉప్పల్‌, ఇబ్రహీంపట్నం డిపోల నుంచి మూడు, నాలుగు చొప్పున బస్సులను కార్గోకు వినియోగిస్తున్నారు. ప్రజా రవాణా కొనసాగిస్తూనే మరోవైపు సరుకు రవాణా(కార్గో), పార్సిల్‌, కొరియర్‌ సేవలకు శ్రీకారం చుట్టారు.  

గ్రేటర్‌ పరిధిలో 29 డిపోల్లో 85 కార్గో బస్సులు..

 గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 డిపోల్లో ఈ సేవలను ప్రారంభించారు. 85 కార్గో బస్సులు వీటి కోసం ఉపయోగిస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం సరఫరాకు కూడా ఈ సర్వీసునే వినియోగిస్తున్నారు. వీటికి టెండర్‌ ధర ప్రకారం చెల్లింపులు ఉంటాయి. ప్రతిరోజూ ఒక కార్గో బస్సుకు రూ.20వేల వరకు ఆదాయం వస్తున్నది. ప్రతి డిపో నుంచి 3, 4 బస్సులను కార్గో సేవలకు ఉపయోగిస్తున్నారు.

బుకింగ్‌ కోసం ప్రత్యేక కౌంటర్లు..

  కరోనా నేపథ్యంలో మహానగరానికి వస్తువుల రవాణా అంతగా లేకపోవడంతో ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన కార్గో బస్సులు జగిత్యాల, కామారెడ్డిలలో నడుస్తున్నాయి. రాజేంద్రనగర్‌, మహేశ్వరం, హెచ్‌సీయూ, ఫరూఖ్‌నగర్‌ తదితర డిపోలకు చెందిన 20 బస్సులు ప్రతినిత్యం కొరియర్‌ సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా డిపోల పరిధిలో కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల బుకింగ్‌ కోసం అక్కడక్కడ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌ డిపో పరిధిలోని ఆటోనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్‌ బస్‌ స్టేషన్లలో వీటి బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. స్థానిక డిపోల పరిధిలో ఒక్కో కేంద్రంలో ఒకరు చొప్పున ఎగ్జిక్యూటివ్‌లను నియమించారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌ విధానంపై అవగాహన కల్పించారు. 

ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ..

   కార్గో సర్వీసుల ద్వారా ధాన్యం, బియ్యం, విత్తనాలు, ఎరువులు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పువ్వులు, రేషన్‌ సరుకులు, వసతి గృహం సామగ్రి, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్‌ సెక్టార్‌లోనూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో జిల్లాకు చెందిన కార్గో బస్సుల ద్వారా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)సేవలు పొందుతున్నది. కార్గో, పార్సిల్‌ సేవలు పొందేవారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తుండడంతో పాటు, పంపిన సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ట్రాకింగ్‌ వ్యవస్థ కూడా అందుబాటులోకి తేవడంతో వీటికి రానురాను ఆదరణ పెరుగుతున్నది. 

దూరం, బరువును బట్టి చార్జీ..

   పార్సిళ్ల బరువు, చేర్చాల్సిన గమ్యస్థానం దూరాన్ని బట్టి చార్జీ ఖరారు చేస్తారు. వీటికి హమాలీ, క్లరికల్‌ చార్జీలు అదనంగా ఉంటాయి. అంతేగాక సరుకు, పార్సిళ్లకు బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ సౌకర్యం పొందాలా..? వద్దా ..? అనేది కస్టమర్‌ ఇష్టానికే వదిలేస్తారు. సరుకు విలువపై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది.  . 

   కొరియర్‌  ద్వారా రాఖీలు 

-రాములు, చార్మినార్‌ డివిజనల్‌ మేనేజర్‌

   ఆర్టీసీ కార్గో సేవలతో ఇప్పటికే ప్రజలకు చేరువ కాగా, కొత్తగా సురక్ష సేవలను అందుబాటులోకి తెచ్చింది. రానున్న రక్షా బంధన్‌ పండుగ నేపథ్యంలో రాఖీలను చేరవేసేందుకు ప్రత్యేకంగా కొరియర్‌ సేవలు అందిస్తున్నది. ఇప్పటికే పలు బస్‌స్టేషన్లలో కొరియర్‌ సర్వీసులను ప్రారంభించాం. కరోనా నేపథ్యంలో రాఖీ పండుగకు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.  అందుకే రాఖీలు చేరవేసేందుకు ఆర్టీసీ కొరియర్‌ ద్వారా పార్సిల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు ఆగస్టు 3 వరకు కొనసాగుతాయి. రాఖీలను సాధ్యమైనంత త్వరగా చేరవేయడానికి కృషి చేస్తాం. ప్రజలు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.  

కార్గో చార్జీల తగ్గింపు - తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజశేఖర్‌


తాండూరు/తాండూరు టౌన్‌ : వికారాబాద్‌ ఆర్టీసీ డివిజన్‌ పరిధిలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, చేవెళ్ల ఆర్టీసీ డిపో, బస్‌స్టేషన్లలో కార్గో సేవలు  ప్రారం భమయ్యాయి. త్వరలో అన్ని డిపోలకు ప్రత్యేక కార్గో పార్సిల్‌ బస్సులు వస్తాయి. ఆర్టీసీలో సరుకులు, వస్తువుల రవాణా కోసం ప్రవేశపెట్టిన కార్గో, కొరియర్‌ చార్జీలు తగ్గించాం. కొరియర్‌ చార్జీలు రూ. 50 నుంచి 20 వరకు, రూ.75 నుంచి 30 వరకు, 100 నుంచి 40 వరకు తగ్గించగా, పార్సిల్‌ చార్జీలలో ఐదు కేజీల బరువు వరకు 75 కిలో మీటర్లకు రూ. 0, 76 నుంచి 200 కిలో మీటర్ల వరకు రూ. 35, 201 నుంచి 300 కిలో మీటర్ల వరకు రూ. 40 వరకు తగ్గించాం. తగ్గిన చార్జీలతో పార్సిల్‌, కొరియర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.