మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 22, 2020 , 00:07:13

5 ఎకరాల్లో 18 ప్రాంతాలు...

5 ఎకరాల్లో 18 ప్రాంతాలు...

నాలుగు సర్కిళ్లలో విస్తృతంగా ప్లాంటేషన్‌..

శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ పరిధిలో శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్‌సీపూర్‌, యూసుఫ్‌గూడ సర్కిళ్లున్నాయి. వీటి పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల హుడా కాలనీ, పోలీస్‌ అకాడమీ, న్యాక్‌, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానల్లో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలుండటంతో అక్కడ పూర్తిస్థాయి ప్లాంటేషన్‌కు ఇప్పటికే అధికారులు శ్రీకారం చుట్టారు. ఎర్రగడ్డ దవాఖాన, బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల హుడా కాలనీ సహా పలు ప్రాంతాల్లో యాదాద్రి మోడల్‌ తరహాలో ప్లాంటేషన్‌ను చేపట్టారు. వీటితో పాటు ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో మరో 96 వేల వరకు మొక్కల పెంపకం కొనసాగుతున్నది. మిగిలిన వాటిని వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులు నిశ్చయించుకున్నారు. అయితే నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు సిబ్బందిని నియమించారు. మరోవైపు ‘యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌' ప్రక్రియను వెస్ట్‌జోన్‌ బయో డైవర్సిటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ నీరజాగాంధీ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

యాదాద్రి తరహాలో ప్లాంటేషన్‌.. 

హరితహారంలో భాగంగా జోన్‌ పరిధిలో యాదాద్రి తరహా ప్లాంటేషన్‌ చేపడుతున్నాం. ఇప్పటికే ఆయా సర్కిళ్లలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్‌ ప్రారంభించి సుమారు 60 వేల మొక్కలు పెంచాం. మొత్తం 3.75 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడున్న స్థలాలకు తోడు అదనంగా ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నాం. మొదటి వారంలోగా లక్ష్యాన్ని పూర్తి చేసేలా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాం. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాం. హరితోద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములైతే మంచి ఫలితాలు ఉంటాయి.

- నాగళ్ల రవి కిరణ్‌, జోనల్‌ కమిషనర్‌