గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 18, 2020 , 00:05:19

పల్లెల్లోనూ.. ర్యాపిడ్ టెస్ట్‌

పల్లెల్లోనూ.. ర్యాపిడ్ టెస్ట్‌

  • కరోనా కట్టడికి  పీహెచ్‌సీ ల్లోనే యాంటిజెన్‌ టెస్టులు
  • రంగారెడ్డిలో 20 కేంద్రాలో నిత్యం పరీక్షలు
  • వికారాబాద్‌ జిల్లాకు చేరిన 1800 కిట్లు
  • తాండూరు జిల్లా దవాఖాన తోపాటు వికారాబాద్‌ సీహెచ్‌సీలో షురూ
  • రేపటి నుంచి మర్పల్లిలో..

రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ఎక్కడికక్కడ పరీక్షలు చేసి, త్వరితగతిన ఫలితాలు వెల్లడించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ఆలస్యం కాకుండా శాంపిల్స్‌ సేకరించిన అరగంటలోగా ఫలితాన్ని వెల్లడిస్తారు. పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి, అనుమానిత లక్షణాలు ఉన్న వారికి, దీర్ఘకాలిక  వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. 2 సీహెచ్‌సీ, 20 పీహెచ్‌సీల్లో ఈ టెస్టులు ప్రారంభించారు. దీనికి సంబంధించి వికారాబాద్‌ జిల్లాకు 1800 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు కేటాయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ వచ్చిన వారికి 457 హోంఐసోలేషన్‌ కిట్లు అందజేశారు.


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్నది. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు ప్రజలకు దగ్గరయ్యాయి. గతంలో నగరంలోనే పరీక్షలు జరిగేవి. ఫలితాలు రావడానికి 72 గంటల సమయం పట్టేది. శాంపిల్స్‌ సేకరించినప్పటి నుంచి కరోనా రిజల్ట్స్‌ కోసం ఆందోళనకు గురయ్యేవారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లను గత వారం పదిరోజుల క్రితం అందించారు. ఆ రోజు నుంచి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. వీటి ద్వారా కొవిడ్‌-19 ఫలితాలు అరగంటలో వస్తున్నాయి.

ఈ పరీక్షల ద్వారా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, దీర్ఘకాలిక పాజిటివ్‌ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18,721 మందికి పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్‌ ద్వారా 8707, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా 10,014 పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 3902 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చారు. ఇందులో 405 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లాలోని 2 సీహెచ్‌సీ, 20 పీహెచ్‌సీలలో ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఇందులో కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారు, అనుమానితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. స్థానికంగానే ఫలితాలు వెంటనే వెల్లడిస్తుండడంతో ఇక నిరీక్షణ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

     జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని ప్రాంతాల్లో యాంటిజెన్‌ పరీక్షలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. జిల్లాలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో యాంటిజెన్‌ టెస్టులు ప్రారంభించారు. పరీక్ష యంత్రాలను కూడా ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌లకు శిక్షణ సైతం ఇవ్వడంతో వారు ఈ యాంటిజెన్‌ టెస్టులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మొదటి విడుతలో అధికంగా కరోనా పాజిటివ్‌ నమోదవుతున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వాస్తవానికి కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం అయినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పది రోజుల నుంచి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫెక్షన్ల తీవ్రతను గుర్తించేందుకు యాంటిజెన్‌ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పరీక్ష తర్వాత లక్షణాలు ఉండి..  నెగెటివ్‌ వస్తే ‘ఆర్టీపీసీఆర్‌'కే... 

   శరీరంలోకి చేరిన రోగ కారకాన్ని యాంటిజెన్‌ (ప్రతినకం) అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఆ వెంటనే రోగ నిరోధక శక్తినిచ్చే వ్యవస్థ మోహరించే రక్షక భటులే యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) అంటారు. యాంటిజెన్‌ను గుర్తించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ సోకిందా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయనున్నారు. వైరస్‌ సోకిన కొన్ని గంటల్లోనే ఈ టెస్టులు చేస్తే పాజిటివ్‌గా చూపిస్తుంది. ఇక వేళ వైరస్‌ అటాక్‌ చేయకపోతే నెగెటివ్‌ అని రిపోర్టు వస్తుంది. సాధారణంగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలేవీ నిర్వహించరు. కానీ కొవిడ్‌-19 లక్షణాలు ఉండి నెగెటివ్‌ రిపోర్టు వస్తే మాత్రం వారికి రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) ల్యాబ్‌కు పంపిస్తారు.

 20  కేంద్రాలు..

  జిల్లాలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను కొవిడ్‌-19 అధికంగా కేసులు నమోదవుతున్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. సరూర్‌నగర్‌, బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రంగనాయకులకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవరంపల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గం, నందివనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరు తదితర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టుల కోసం..

   జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. జిల్లాలోని 233 సబ్‌ సెంటర్లకు, 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 16 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు, 2 సీహెచ్‌సీలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టింగ్‌ గన్స్‌, పల్స్‌ ఆక్సిమీటర్లను అందించారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయనియంత్రణ పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 457 హోం ఐసోలేషన్‌ కిట్లు అందించారు. 

  వికారాబాద్‌ జిల్లాలో..

 ఇప్పటికే జిల్లా దవాఖాన, వికారాబాద్‌ సీహెచ్‌సీలో కొనసాగుతున్న ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహిస్తారు. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన తర్వాతనే ప్రారంభించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి పీహెచ్‌సీలలో ల్యాబ్‌ సౌకర్యాలు, సరైన సిబ్బంది లేకపోవడంతో తాండూర్‌లోని జిల్లా దవాఖానతోపాటు వికారాబాద్‌, మర్పల్లిలోని సీహెచ్‌సీలలో మాత్రమే కొవిడ్‌ పరీక్షలు ప్రారంభించారు. 

1800  కిట్లు..

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 1800 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను కేటాయించింది. అయితే వీటిలో తాండూర్‌లోని జిల్లా దవాఖానకు 500, వికారాబాద్‌ సీహెచ్‌సీ(ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం)కి 250, మర్పల్లి ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి 250, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే నిమిత్తం మరో 800 ర్యాపిడ్‌ కిట్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా దవాఖానలో రెండు రోజులుగా ర్యాపిడ్‌ పరీక్షలు కొనసాగుతుండగా ఇప్పటివరకు గర్భిణులు, అత్యవసర చికిత్సలకై వచ్చిన 50 మందికి పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్‌ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నుంచి ర్యాపిడ్‌ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వికారాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించిన వికారాబాద్‌ మున్సిపల్‌ సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మర్పల్లి సీహెచ్‌సీకి శుక్రవారం రాత్రిలోగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను పంపించనున్నారు. శనివారం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలపై అక్కడి సిబ్బందికి శిక్షణనిచ్చిన అనంతరం ఆదివారం నుంచి మర్పల్లి సీహెచ్‌సీలోనూ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే గర్భిణులతోపాటు అత్యవసర చికిత్సలకై వచ్చే డయాలసిస్‌,

గుండెజబ్బు, క్యాన్సర్‌ తదితర రోగులకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరమే వైద్యమందిస్తారు. అంతేకాకుండా కొవిడ్‌ లక్షణాలు కనిపించే దవాఖాన వైద్యులతోపాటు నర్సులకు కూడా ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తారు. ముఖ్యంగా వైద్యులు నిర్దారించిన వారికే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను కేటాయించగా.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సరిపోను సిబ్బంది, ల్యాబ్‌ వసతి లేకపోవడంతో ప్రస్తుతానికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయడంలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుధాకర్‌ షిండే తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్స్‌ సేకరించే వ్యవస్థ ఉండదు కాబట్టి తిరిగి సీహెచ్‌సీలకు, జిల్లా దవాఖానకు పంపించాల్సి ఉంటుంది. తాండూర్‌ జిల్లా దవాఖానతోపాటు వికారాబాద్‌, మర్పల్లి సీహెచ్‌సీలలోనే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే పీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ టెస్టులకు సంబంధించి సిబ్బందికి శిక్షణనిచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించేందుకు కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. 

14 పాజిటివ్‌ కేసులు..

జిల్లాలో శుక్రవారం 14 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుధాకర్‌ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 12, ధారూర్‌ మండలంలో 1, కుల్కచర్ల మండలంలో 1 పాజిటివ్‌ కేసు నమోదైందని, మరో 21 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. శుక్రవారం మరో 35 మంది అనుమానితుల శాంపిల్స్‌ వైద్యులు సేకరించారు. ఇప్పటివరకు 1075 శాంపిల్స్‌ సేకరించగా 962 మందికి నెగెటివ్‌రాగా, మరో 152 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ నుంచి కోలుకొని 64 మంది డిశ్చార్జికాగా మరో 9 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరోవైపు ప్రస్తుతం జిల్లాలో సాధారణ గృహ నిర్బంధంలో 35,725 మంది ఉండగా, మరో 32,875 మంది 28 రోజుల హోంక్వారెంటైన్‌ను పూర్తి చేసుకున్నారు.