గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 18, 2020 , 00:08:27

పచ్చదనంతో కళకళలాడాలి

పచ్చదనంతో కళకళలాడాలి

  • హరితహారంలో అందరూ పాల్గొనాలి  
  • పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి 
  • సీజనల్‌ వ్యాధుల పట్ల  అప్రమత్తత అవసరం
  • రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 
  • జాతీయ రహదారిపై మొక్కలు నాటిన కలెక్టర్‌ 

కొత్తూరు: జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చూడాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు.  కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ వద్ద, నందిగామ మండలం చాకలిగుట్టతండా సమీపంలో జాతీయ రహదారి పక్కన శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి వెళ్లే జాతీయ రహదారులన్నీ పచ్చదనంతో నిండిపోవాలన్నారు. తిమ్మాపూర్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో శ్రీనివాస్‌, నందిగామ మండలంలో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీపీవో పద్మజారెడ్డి, డీఎల్‌పీవో సునందారెడ్డి,  జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో గిరిరాజ్‌ పాల్గొన్నారు.

సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి..

షాద్‌నగర్‌టౌన్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. మున్సిపాలిటీలోని బైపాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, కౌన్సిలర్‌ రాయికల్‌ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అడవుల పెంపకంతోనే జీవుల మనుగడ సాధ్యమనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు.   ప్రజలందరూ విధిగా మొక్కలు నాటి హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో భాగంగా షాద్‌నగర్‌ పట్టణంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్న వ్యాపారులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య, అధికారులు పాల్గొన్నారు.