ఆదివారం 09 ఆగస్టు 2020
Rangareddy - Jul 16, 2020 , 00:13:07

వాగూ..వంక ఉప్పొంగంగ‌

వాగూ..వంక ఉప్పొంగంగ‌

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వాన
  • మత్తడి దుంకుతున్న చెరువులు, డ్యామ్‌లు
  • పొంగిపొర్లిన ఈసీ, మూసీ, నస్కల్‌ వాగులు 
  • గండిపేట, హిమాయత్‌ సాగర్‌లకు భారీగా వరద నీరు 
  • రెండేండ్ల తరువాత  లక్నాపూర్‌ ప్రాజెక్టుకు జలకళ
  • పలుచోట్ల చేపలు పడుతూ గ్రామస్తుల సంబురం
  • అన్నదాతల ఆనందం


ఈసీ, మూసీలు వాన నీటితో కళకళలాడుతున్నాయి. కొన్నేండ్ల నుంచి బోసిపోయి ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు మత్తడి దుంకు తున్నాయి.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో లక్నాపూర్‌ ప్రాజెక్టు  రెండేండ్ల తరువాత జలకళను సంతరించుకున్నది. కాకరవేణిలో వర్షపునీరు పోటెత్తడంతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌లు వరదనీటితో నిండుకుండల్లా       కనిపిస్తున్నాయి. పారుతున్న నీళ్లలో చేపలు పట్టే వారితో వాగుల పరిసరాలు సందడిగా మారాయి. రోడ్డుపై నుంచి నీళ్లు పారడంతో పరిగి - వికారాబాద్‌ దారిలో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇప్పటికే సాగుపనుల్లో తలమునకలై ఉన్న అన్నదాతలు ఈ వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.                      రంగారెడ్డి/ వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లోకి వరద నీరు చేరడంతో పలు మండలాల్లోని చెరువులు అలుగుపారాయి. జిల్లాలోని ఈసీ, నస్కల్‌, దోర్నాల్‌, గాజీపూర్‌ వాగులు పొంగిపొర్లాయి. పరిగి మండలంలోని లక్నాపూర్‌ ప్రాజెక్టు రెండేండ్ల తర్వాత జలకళను సంతరించుకున్నది. యాలాల మండలంలో కురిసిన భారీ వర్షానికి బొంరాస్‌పేట్‌ మండలంలోని కాకరవేణి ప్రాజెక్టులోకి అధిక మొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరింది. జిల్లాలోని దోమ, మర్పల్లి, కొడంగల్‌, ధారూరు, బంట్వారం, యాలాల మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సంబంధిత మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దాదాపు అన్ని చెరువుల్లోకి నీరు చేరడంతో నిండుకుండలా మారాయి. పూడూరు మండలంలో కురిసిన వర్షంతో కంకల్‌, చన్గోముల్‌ వద్ద ఈసీ వాగు పొంగి ప్రవహించింది. మరోవైపు పరిగి-వికారాబాద్‌ మధ్య గల నస్కల్‌ వాగు పొంగిపొర్లడంతో బుధవారం మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్‌ మండలంలోని దోర్నాల్‌ వాగు, పెద్దేముల్‌ మండలంలోని గాజీపూర్‌ వాగులు నిండి, పారడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోమ మండలంలోని ఐనాపూర్‌ పెద్ద చెరువులోకి భారీగా నీరు చేరుకుంది. బొంరాస్‌పేట్‌ మండలంలోని బురాన్‌పూర్‌లోని చిన్నవాగు నిండింది. దేవులనాయక్‌ తండాలోని చేపల వాగు, కొడంగల్‌లోని పెద్ద చెరువులోకి భారీగా నీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షపు నీటికి పరిగిలోని బీసీ కాలనీలో పలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. పరిగి పట్టణంలో వర్షపు నీటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 

దోమ మండలంలో అత్యధికంగా 7 సెం.మీ వర్షపాతం..

దోమ మండలంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 6.4, కొడంగల్‌లో 5.2, బంట్వారంలో 5.2, ధారూరులో 5.1, యాలాలలో 5, కుల్కచర్లలో 4.6, పరిగిలో 4.5, మోమిన్‌పేటలో 4.3, నవాబుపేటలో 4.2, వికారాబాద్‌లో 3.1, తాండూరులో 2.8, బషీరాబాద్‌లో 2.2, పూడూరులో 1.2, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఒక్క సెం.మీ వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి జిల్లాలో.. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్‌నగర్‌ డివిజన్ల పరిధిలో భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు జిల్లాలోని ఈసీ, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. జూలై మొదటి వారంలో కూడా అడపాదడపా వర్షాలు కురిశాయి. భారీగా కురుస్తున్న ఈ వానలతో పంటలకు చాలా మేలు జరుగుతున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణం కంటే అధికంగా..

జిల్లాలో 27 మండలాలు ఉండగా.. 22 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. మాడ్గుల, గండిపేట, శేరిలింగంపల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. జూలైలో 152.8 మి.మీ కురువాల్సి ఉండగా.. ఇప్పటివరకు 81.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో బుధవారం రాత్రి 7 గంటల వరకు సగటున 4.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, నందిగామ, కొత్తూరు, షాబాద్‌, కేశంపేట, చౌదరిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా కడ్తాల్‌ మండలంలో 6.8 సెం.మీ., గండిపేటలో 3.6 సెం.మీ కురిసింది. 

పొంగిపొర్లిన చెరువులు, వాగులు

జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షం ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చేవెళ్ల మండలం దేవరంపల్లి, శంకర్‌పల్లి మండలంలో ఉన్న మూసీ, ఈసీ వాగులకు వరద నీరు భారీగా చేరడంతో పొంగిపొర్లాయి. జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు సగటున 4.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కొందుర్గులో 4.9, తలకొండపల్లిలో 4.2, కడ్తాల్‌లో 6.8, ఆమనగల్లులో 3.8, యాచారంలో 3.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు నిండాయి. జిల్లాలో అతిపెద్ద వాగులైన ఈసీ-మూసీ వాగులు పొర్లడంతో గండిపేట, హిమాయత్‌ సాగర్‌లకు వరద నీరు భారీగా చేరుకుంది. చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. వర్షంతో జిల్లా ప్రజల జీవనం స్తంభించింది. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు 

జిల్లాలోని జంట జలాశయాలు హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లో నీటి మట్టం పెరుగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రెండు జలాశయాల్లో భారీగా వరద నీరు చేరింది.

హిమాయత్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.5 అడుగులు 

బుధవారం నాటికి : 1728.25 అడుగులు 

ఉస్మాన్‌సాగర్‌ (గడిపేట)

పూర్తి స్థాయి నీటి మట్టం : 1790 అడుగులు 

బుధవారం నాటికి : 1765. 25 అడుగులుlogo