ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jul 15, 2020 , 01:36:49

వారం రోజుల్లో..ఫార్మా పరిహారం

వారం రోజుల్లో..ఫార్మా పరిహారం

ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీ ఏర్పాటులో భూసేకరణలో భాగంగా ఇప్పటికే పరిష్కారమైన భూములకుగాను వారం రోజుల్లోగా రైతులకు పరిహారం చెక్కులను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఫార్మాసిటీ, ఎలిమినేడు భూసేకరణపై జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌తో కలిసి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద, ముచ్చర్ల గ్రామాలకు చెందిన రైతుల అభిప్రాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో భాగంగా రైతుల అభ్యంతరాలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫార్మాసిటీ, ఎలిమినేడు భూసేకరణలో రైతుల అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. యాచారం మండలానికి చెందిన ఫార్మా భూసేకరణలో ఇప్పటికే పరిష్కారానికి నోచుకున్న భూములకు పరిహారం చెక్కులను వారం రోజుల్లోగా రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా భూసేకరణకు సంబంధించి రైతుల అభ్యంతరాలను త్వరలోనే మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.  ఫార్మాసిటీ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కొంతమంది తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. దీనికోసం అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఏవో సుచరిత, తాసిల్దార్లు నాగయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.