బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 14, 2020 , 01:33:18

మొయినాబాద్‌ ఈసీ సుధాకర్‌ విధుల నుంచి తొలగింపు

మొయినాబాద్‌ ఈసీ సుధాకర్‌ విధుల నుంచి తొలగింపు

  • ఎండీవోకు షోకాజ్‌ నోటీస్‌-రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : విధులపట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన మొయినాబాద్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ అక్కేనపల్లి సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల అమలులో నిర్లక్ష్యం వహించిన మొయినాబాద్‌ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి విజయలక్ష్మికి షోకాజ్‌ నోటీసును జారీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హరితహారంలో మొక్కలు నాటడంలో అలసత్వం, ఉపాధి హామీ పథకాన్ని కూలీలకు వర్తింపచేయకపోవడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిరాశజనక ఫలితాలు, జాబ్‌ కార్డు కలిగినవారి కనీస సమాచారం అందించడంలో విఫలమైన మొయినాబాద్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ను కాంట్రాక్ట్‌ నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హరితహారం, ఉపాధిహామీ, ప్రకృతి వనాల నిర్మాణం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మొయినాబాద్‌ మండలం పలు అంశాల్లో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయకపోవడం పట్ల కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ను విధుల నుంచి తొలిగించడంతోపాటు మండల అభివృద్ధి అధికారికి షోకాజ్‌ నోటీసు ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ నోటీసుకు మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని.. లేకుంటే చట్టబద్దమైన చర్యలు చేపడుతామని కలెక్టర్‌ హెచ్చరించారు.