మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 13, 2020 , 00:02:19

దూదిపూల‌కే మొగ్గు...

 దూదిపూల‌కే మొగ్గు...

  • రంగారెడ్డి జిల్లాలో జోరుగా నియంత్రిత సాగు
  • ప్రస్తుతం 65 శాతం పొలాల్లో పంటలు..
  • ఈనెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం
  • గతేడాదిలో 2.14 లక్షలు, ఈసారి 2.48 లక్షల ఎకరాల్లో పత్తి 
  • 82 వేల ఎకరాలకు పైగా కంది సాగు
  • మరో 30 వేల ఎకరాల అంచనా 
  • ఈనెల 20వరకు విత్తుకునేందుకు అనుకూలం
  • మక్కజొన్నకు స్వస్తి
  • కందికి లేదు.. రంది

తెల్ల బంగారానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. దూదిపూల సాగుకే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. కందికి అసలు రందే లేదు.. ఈ వానకాలం పంటల సాగు జోరుమీదున్నది. రంగారెడ్డి జిల్లాలో 65 శాతం పొలాల్లో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా మక్కజొన్నకు బదులుగా పత్తి, కంది, జొన్న పంటలు సాగు దిశగా రైతులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పత్తిని రికార్డు స్థాయిలో సాగు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 2.14 లక్షలైతే.. ఈసారి 2.48 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పత్తి విత్తేందుకు మరో రెండు వారాల పాటు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

 రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతుడుటంతో రైతులు పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 65శాతం పంటల సాగు ప్రారం భమైనట్లు వ్యవసాయశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా రైతు లు పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంట్లో భాగంగా మక్కజొన్నకు బదులుగా పత్తి, కంది, జొన్న పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రణాళికలు చేయడంతో ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. అలాగే మక్కజొన్న పంటను వాణిజ్య పంటగా కాకుండా తమ అవసరాల కోసమే 4వేల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేసిన్నట్లు అధికారులు తెలిపారు. 

దూదిపూల పంటపైనే మక్కువ

గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రైతులు దూది పంటకే మొగ్గు చూపారు. ఇప్పటికే గత సీజన్‌లో సాగైన విస్తీర్ణానికి దగ్గరలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు మరికొంత సమయం ఉండడంతో రికార్డు స్థాయిలో ఈసారి పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వానా కాలంలో 2.14లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. నియంత్రిత సాగులో భాగంగా ఈ సీజన్‌లో 2.48 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొదించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1.94లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు తెలిసింది. 

కందికి రందిలేదు..

జిల్లాలో కందిసాగు గణనీయంగా పెరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఈసారి 82వేల పైచిలుకు ఎకరాల్లో సాగు చేస్తారని ప్రణాళికలో వెల్లడించారు. ఇప్పటి వరకు 31వేల ఎకరాల్లో కంది సాగు అయ్యింది. గతేడాది ఈ కంది పంట 18వేల ఎకరాలకే పరిమితమైంది. మక్కజొన్నకు బదులుగా ఎక్కువ మంది రైతులు కంది పంటపై ఆసక్తి చూపుతు న్నారు. ఈ నెల 20వరకు సాగుకు అనుకూలమని, అంత లోపు మరో 30వేల ఎకరాల్లో కంది పంట సాగయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో వరి సాగు ఇప్పుడిపుడే మొదలవుతుంది. ప్రస్తుతం వరి నార్లు పోసుకుంటున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయశాఖ వివరించింది. ఈసారి 36వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనాలు వేయగా.. ఇప్పటి వరకు 15వేల ఎకరాల్లో వరి సాగు నమోదైంది.

మక్కజొన్నకు స్వస్తి..

జిల్లాలో మక్క జొన్నకు రైతులు స్వస్తి పలికారు. మక్క జొన్న కు ప్రత్యామ్నాయ పంటల్లో జొన్న కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ పంట సాగు చేసేందుకు అనుకూల పరిస్థితులు ముగిసాయి. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో జొన్న సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. గతంతో పోలిస్తే మూడోవంతు జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 27వేల ఎకరాల్లో జొన్న సాగవుతుందని ప్రణాళికలు వేయగా..10వేల ఎకరాలకే జొన్న పరిమితమైంది. గతేడాది 26వేల ఎకరాల్లో జొన్న సాగైంది. 373ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికలు రూపొదించగా.. 366ఎకరాల్లో పెసర పంటను సాగు చేశారు. ఇకపోతే ఉలువలు, చెరకు సాగుకు జిల్లా రైతులు మొగ్గు చూపలేదు.


నెల     సాధారణ     వర్షపాతం

                    (మి.మీలలో)

జూన్‌         91.7     155

జూలై     152.8             47.3


లక్ష్యంవైపు..నియంత్రిత సాగు

జిల్లాలో నియంత్రిత సాగు పంటల విధానానికి అనుగుణంగా పంటలు సాగు జరుగుతోంది. మక్కజొన్నకు బదులుగా కంది, పత్తిని సాగు చేయడానికి కర్షకులు ఆసక్తి చూపుతున్నారు. మక్కజొన్నను పూర్తిగా వేయకూడదని రైతులకు అవగాన కల్పించాం. పశువులకు మేత, కోళ్లకు దాణా అవసరాల కోసం మినహా గతంలో మాదిరిగా సాగు చేయడం లేదు. జిల్లాలో ఆ యా పంటల సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. విత్తనా లు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు, డీసీఎంఎస్‌, ప్రైవేట్‌ డీలర్లు, ఆయా అగ్రి సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా రైతులు అధికారులను సంప్రదించాలి.

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి