బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 00:49:09

14రోజులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌

14రోజులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌

 యాచారం: మండల కేంద్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో 14రోజుల పాటు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానించింది. సర్పంచ్‌ ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించాలని సభ్యులు చర్చించి తీర్మానం చేశారు. మెడికల్‌ షాపులు మినహా కిరాణా షాపులు, కూరగాయలు, పాలు లాంటి దుకాణాలు కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 నుంచి రూ.5000 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ లలిత, వార్డు సభ్యుడు నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లెలకు పాకిన కరోనా

  • మేడిపల్లిలో ఒకరు మృతి
  • రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
  • జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతున్నాయి. నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అరగంటలోనే ఫలితాలు వచ్చే విధంగా ఈ టెస్టులు చేస్తున్నారు. యాచారంలో రెండురోజులుగా నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టుల్లో పదిమంది వరకు బయటపడ్డారు. శుక్రవారం 24 మందికి టెస్టులు చేయగా ఆరుగురికి, శనివారం నలభైమందికి టెస్టులు చేయగా ఐదుగురికి, అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ నలభైమందికి టెస్టులు చేయగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. పదిహేను రోజుల క్రితం యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో ఆమె చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ నగరానికి వచ్చిపోయేవారిలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. టెస్టుల ద్వారా అరగంటలోనే ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కేసులు బయటపడే అవకాశాలున్నాయి.

ఒకరికి కరోనా

పెద్దఅంబర్‌పేట : తట్టిఅన్నారం  పరిధిలోని  హతిగూడలో ఇండ్లలో పని చేసే 26 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. వెంటనే అప్రమత్తమైన మున్సిపాలిటీ సిబ్బంది కాలనీలో శానిటేషన్‌ చేయించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఐదుగురికి కరోనా పాజిటివ్‌

యాచారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 24మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికికరోనా పాజిటివ్‌ అని తేలింది. మంథన్‌గౌరెల్లి గ్రామంలో ఇద్దరు, యాచారంలో ఇద్దరు, ఇబ్రహీంపట్నం శేరిగూడలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ నాగజ్యోతి తెలిపారు. ఆయా గ్రామాల్లో పాజిటివ్‌ వచ్చిన బాధితుల కుటుంబాలను హోం క్వారంటైన్‌ చేశారు. 

మహిళ మృతి

మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన 40 ఏండ్ల మహిళ కొన్ని నెలలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా దవాఖానకు చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్కడే ఆమె కరోనా మహమ్మారి బారిన పడింది. 20 రోజుల క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. 

అప్రమత్తతతోనే కరోనా కట్టడి

 ప్రభుత్వ వైద్యాధికారి అభిరామ్‌

ఇబ్రహీంపట్నంరూరల్‌ : కరోనా వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యాధికారి, కొవిడ్‌ టెస్టింగ్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ అభిరామ్‌ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ..కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నందున బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.  భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు.