మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 00:46:50

కొత్త పీఎస్‌తో ‘ట్రాఫిక్‌'కు చెక్‌

కొత్త పీఎస్‌తో ‘ట్రాఫిక్‌'కు చెక్‌

  • పరిగిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌
  • ప్రతిపాదనలు పంపించిన అధికారులు
  • త్వరలోనే పరిగిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌
  • రోజు 24వేల పైచిలుకు వాహనాల రాకపోకలు 

పరిగి: రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం కోసం పరిగిలో ప్రత్యేకంగా ఓ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కొన్నేండ్ల నుంచే ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుపై పోలీసు అధికారులు కసరత్తు జరుపుతుండగా ఇటీవల ప్రతిపాదనలు పంపించారు. దీంతోపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేకంగా సిగ్నల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో నుంచే జాతీయ రహదారి ఉండడం,  నిత్యం వివిధ పనులపై పట్టణానికి వచ్చే వారి సంఖ్య వేలలో ఉంటుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పోలీసులు రోజువారీ విధులు, వీఐపీల బందోబస్తుకు సరిపోతున్నారు. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిగిలో ప్రత్యేకంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి  ప్రతిపాదనలు  పంపించారు. అన్ని అనుమతులు వస్తే కొద్ది నెలల్లోనే పరిగిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కానుంది. ఈలోపే పరిగిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 

 నిత్యం 24వేలకు పైగా వాహనాలు రాకపోకలు...

గత పదేండ్లలో వాహనాల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు యోచనలో భాగంగా ఇటీవల అధికారులు సర్వే చేపట్టారు. పరిగి చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు అనునిత్యం కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు జాతీయ రహదారిపై  నుంచి పరిగి పట్టణం ద్వారానే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సర్వే ఆధారంగా ప్రతిరోజూ  20,000 ద్విచక్ర వాహనాలు, రెండు వేల  ఫోర్‌ వీలర్స్‌, 500 త్రీ వీలర్స్‌, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 200, వెయ్యి గూడ్స్‌ వాహనాలు, 500 ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలుసుకున్నారు. మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు మరింత పెరిగాయి. మరోవైపు పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే వివిధ గ్రామాలకు ప్రయాణికులను తరలించే ఆటోలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలు సైతం తమ ఇష్టానుసారంగా రోడ్డుపై నిలిపి  సామగ్రిని దుకాణాలలో దించుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగి ట్రాఫిక్‌ కష్టాలు ఏర్పడుతుంటాయి. మరోవైపు శుక్రవారం, శనివారం రెండు రోజులు పరిగిలో అంగడి జరుగుతుంది. ఈ రెండు రోజులు గంజ్‌రోడ్డులో ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. జాతీయ రహదారిపై నుంచి మార్కెట్‌లోకి వెళ్లే మార్గం(స్వామి వివేకానంద విగ్రహం) వద్ద సైతం తరచుగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ వాహనం  ఎటునుంచి వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. 

 40 మందితో..

ట్రాఫిక్‌ కష్టాలను పరిష్కరించేందుకు 40 మంది సిబ్బందితో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు ప్రతిపాదించారు. పరిగితోపాటు మన్నెగూడ క్రాస్‌రోడ్డు, వాహనాల రద్దీ అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో  ట్రాఫిక్‌ సిబ్బందిని నియమించడం ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించవచ్చు.  హోం శాఖ నుంచి అనుమతులు మంజూరైతే రాబోయే కొద్ది నెలల్లోనే ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు జరుగుతుంది. పరిగిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి  ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సూచించారు. రాజకీయంగా సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేలా కృషి జరుగుతుంది.  

 మూడు కూడళ్లలో సిగ్నల్స్‌ ప్రతిపాదనలు...

మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి నిర్మాణం వల్ల  వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణంలో తరచుగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో భాగంగా పరిగి పట్టణంలోని కొడంగల్‌ క్రాస్‌రోడ్డు, బస్టాండు, టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించి, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 ప్రతిపాదనలు పంపించాం..  

-  లక్ష్మీరెడ్డి,సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, పరిగి 

పరిగిలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు. 40 మంది సిబ్బందితో   ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరాము. ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి పరిగి పట్టణంలోని మూడు కూడళ్లలో సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాం. అనుమతులు వస్తే సాధ్యమైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.