బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 00:30:32

కరోనా వచ్చినా.. సంక్షేమం ఆగలే

 కరోనా వచ్చినా.. సంక్షేమం ఆగలే

  • రైతాంగం సంతోషంగా ఉండాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన
  • కరోనాకు, కొత్త సచివాలయానికి సంబంధం ఏమిటీ?
  • అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • కంసాన్‌పల్లి పశువీర్యోత్పత్తి కేంద్రంలో మొక్కలు నాటిన మంత్రి, అధికారులు

కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఆగమైనా తెలంగాణలో సంక్షేమం ఆగలేదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రతి రైతు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. శనివారం ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి పంచాయతీలో నిర్మిస్తున్న పశు వీర్యోత్పత్తి కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. 

షాద్‌నగర్‌ : కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ ఆగమైనా రాష్ట్రంలో సంక్షేమం ఆగలేదని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న పశువీర్యోత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలను నాటిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రలోని ప్రతి రైతు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో, రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతుందని చెప్పారు. కరోనా వచ్చిన సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించలేదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర పరిపాలన కోసం కొత్త సచివాలయం నిర్మాణం కోసం పనులు చేపడితే కరోనా ఉన్న సమయంలో నిర్మాణం ఎలా చేపడుతారని అర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా వచ్చిన కూడా రైతు బంధు ఆగిందా ? రైతు ధాన్యం కొనుగోళ్లు ఆగినవా ? రాష్ట్ర సంక్షేమం ఆగిందా ? అనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు తెలుసుకోవాలని సూచించారు. కరోనా నిర్మూలనకు, రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీలు సూచనలు చేయాలే తప్పా,  ఉట్టి మాటలు చెప్పొద్దని హితవుపలికారు.  పశు సంవర్ధక శాఖ అధికారులతో ప్రతి మూడు నెలలకు ఒక్కసారి సమీక్ష నిర్వహిస్తున్నామని, సంబంధిత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌లో గొర్రెల మార్కెట్‌, వనపర్తి పట్టణంలో బర్రెల దవాఖానను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల శ్రేయస్సు కోసం తీవ్రంగా కృషిచేస్తున్నామని,

ప్రతి గోపాల మిత్రకు నెలసరి వేతనంగా రూ. 8,500 ఇస్తున్నామని చెప్పారు. హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దీటుగా రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దీంతో పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, జడ్పీ సీఈవో మంజువాణి, డీఎల్‌డీఏ చైర్మన్‌ నారాయణరెడ్డి, చెన్నాకిషన్‌రెడ్డి, సర్పంచ్‌ పద్మ, ఆర్డీవో రాజేశ్వరి, తాసిల్దార్‌ పాండు, ఎంపీడీవో  శరత్‌బాబు, ఏవో నిశాంత్‌, పశు సంవర్ధక శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.