మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jul 10, 2020 , 23:14:56

జనాభాకు అనుగుణంగా హాస్పిటళ్ల సంఖ్య పెంచాలి

జనాభాకు అనుగుణంగా హాస్పిటళ్ల సంఖ్య పెంచాలి

  • వైద్య అధికారులతో  కరోనా, ఇతర అంశాలపై సమీక్ష
  • మరో పది బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని సూచన
  • అదనంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల  కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్న మంత్రి
  • మహేశ్వరంలో కరోనా పరీక్షాకేంద్రం ఏర్పాటుకు ఆదేశం 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ:  నగర శివార్లలో నూతన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోను జనాభాకు అనుగుణంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సబితారెడ్డి వైద్యాధికారులకు ఆదేశించారు. శుక్రవారం నగరంలోని మంత్రి చాంబర్‌లో జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ జాన్సీ ఇతర అధికారులతో కొవిడ్‌-19, ఇతర వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష  నిర్వహించారు. జిల్లాలో మరో 10 బస్తీ దవాఖానలతో పాటు మహేశ్వరం సీహెచ్‌సీని వంద పడకల దవాఖానగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వీటి మంజూరుకు కృషి చేస్తానన్నారు. బాలాపూర్‌ సీహెచ్‌సీలో అదనపు గదుల కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని,  మీర్‌పేట్‌, జిల్లెలగూడలలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లతో జిల్లాలో ఇప్పటికే 8 వేల పరీక్షలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మహేశ్వరంలోనూ కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.