మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Jul 10, 2020 , 00:21:47

ముంగిట్లో సాగుదీపిక‌

ముంగిట్లో సాగుదీపిక‌

  • అందుబాటులో అన్ని రకాల సేవలు
  • సమగ్ర సమాచార శిక్షణా నిలయం
  • రైతువేదికలో సమావేశాల నిర్వహణ
  • రైతుబంధు కింద ఆర్థిక సాయం 
  • రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 
  • ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి పరిగి నియోజక వర్గంలో శంకుస్థాపన

అన్నదాతలకు అండగా నిలువడంతోపాటు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనల కోసం వ్యవసాయాధికారులను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ వేదికలు సాగు దీపికలు అని ఆమె పేర్కొన్నారు. రైతుల ముంగిట్లోకి అన్ని రకాల సేవలను తీసుకొస్తున్నట్లు వివరించారు. గురువారం పరిగి మండలం రంగాపూర్‌, పూడూరు మండలం చన్గోముల్‌, దోమ, కులకచర్ల మండల కేంద్రాల్లో రైతువేదికల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 

 పరిగి/కులకచర్ల/పూడూరు/దోమ : ప్రభుత్వం రైతుల ముంగిట్లోకి పలు రకాల సేవలు తీసుకువస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలువడంతోపాటు ఎప్పటికప్పుడు సలహాలకు వ్యవసాయాధికారులను మరింత చేరువ చేస్తుందన్నారు. గురువారం పరిగి మండలం రంగాపూర్‌, పూడూరు మండలం చన్గోముల్‌, దోమ, కులకచర్ల మండల కేంద్రాలలో రైతువేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి, వ్యవసాయ విస్తరణాధికారులను నియమించిన ప్రభుత్వం మరిన్ని సేవలు అందించేందుకు రైతువేదికల నిర్మాణం చేపడుతున్నదన్నారు. రైతువేదికల నిర్మాణం ద్వారా రైతులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి, క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతుబంధు కమిటీల సభ్యులు, రైతులకు శిక్షణా శిబిరాల నిర్వహణకు దోహదం చేస్తాయన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్‌ సదుపాయం, ఇతర అంశాలపై చర్చించుకునేందుకు వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.

ఒక్కో రైతువేదికను రూ.22లక్షల వ్యయంతో నిర్మిస్తు న్నామని, సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించినట్లు చెప్పారు. పంటల సాగుకు రైతులకు పెట్టుబడి సాయం గా రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.14వేల కోట్లు అందిస్తున్నామని, వానకాలం సం బంధించి రూ.7వేల కోట్లు అందించినట్లు తెలిపారు. రైతులకు మేలు చేసేలా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి పంటల కొనుగోలుతోపాటు డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిందన్నారు. వ్యవసాయాధికారులు సూచించిన పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లాభపడాలని మంత్రి తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో బతుకాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 అందజేసిందన్నారు. జూలై నుంచి నవంబర్‌ వరకు ఒక్కొక్కరికి 10కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. జిల్లాలో 2.34లక్షల కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పేద వారందరికీ బియ్యం అందేలా చూడాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా పరిగి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు తమవంతు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు డీసీసీబీ ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు అందించేందుకు పరిగి ప్రాంతానికి డీసీసీబీ పదవిని పరిగి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనోహర్‌రెడ్డికి ఇచ్చామ న్నారు. చన్గోముల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలోని బోర్డుపై మాజీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేరును విద్యాశాఖ మం త్రిగా రాసి ఉంచడంతో ఉపాధ్యాయుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు.

గ్రామ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై 4 సంవత్సరాలుగా వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయడం లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి అన్ని వేళల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదిక నిర్మాణానికి నిధులు విడుదల చేయడం ద్వారా రైతాంగ సంక్షేమంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధ నిరూపితమైందని అన్నారు. పరిగి ప్రాంతానికి పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు రావడం ఖాయమని, సీఎం కేసీఆర్‌ స్వయంగా పరిగి బహిరంగసభలో హామీనిచ్చారన్నారు. ఎలాగైనా సాగునీరు తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, అనసూయ, సత్యమ్మ, జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, మేఘమాల, రాందాస్‌, ఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులు రాజేందర్‌, రాజు, లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి, పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి ఉన్నారు.