బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jul 09, 2020 , 23:45:17

కరోనా నివారణకు పటిష్ట చర్యలు

కరోనా నివారణకు పటిష్ట చర్యలు

  • జిల్లాలో ‘ర్యాపిడ్‌ యాంటిజెన్‌' టెస్టులు 
  • కొత్తూరులో ఆరుగురు, మొయినాబాద్‌లో ముగ్గురికి పాజిటివ్‌

కొత్తూరు రూరల్‌ : కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలను పటిష్టంగా చేపట్టింది. అందులో భాగంగానే గురువారం కొత్తూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కొవిడ్‌-19 పరీక్షలను అధికారులు నిర్వహించారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో సాధారణ కరోనా పరీక్షల ఫలితాలు సుమారు 72గంటల సమయం పట్టేది. ఇప్పుడు పరీక్షలు చేసిన అరగంటలోనే ఫలితాలు వస్తున్నాయి. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 25మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. అరగంటలోనే ఫలితాలు రావడంతో కరోనా పరీక్షలను నిర్వహించుకున్న వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిని వైద్యాధికారులు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలను చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న తక్ష ణ చర్యలను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

మొయినాబాద్‌లో 3పాజిటివ్‌  కేసులు

మొయినాబాద్‌ : కరోనా పరీక్షల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నది. గురువారం మొయినాబాద్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 38మంది పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో మండల పరిధిలోని కాశీంబౌలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, మొయినాబాద్‌లో నివాసం ఉంటున్న ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. రక్త నమూనాలు తీసుకున్న అర గంటలో వారి ఫలితాలు విడుదల చేశారు. 38మందికి పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. వారిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ర్యాపిడ్‌ టెస్టులు షురూ

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కరోనా ర్యాపిడ్‌ టెస్టులు గురువారం ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని ప్రజల కోసం అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం ప్రభుత్వ దవాఖానల్లో గురువారం నుంచి టెస్టులు ప్రారంభించారు. గతంలో కరోనా టెస్టుల కోసం అనేక దవాఖానలకు వెళ్లినప్పటికీ ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూసేవారు. ఈ పరిస్థితిలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లోనే టెస్టులు ప్రారంభించింది. దీంతో గురువారం అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం ప్రభుత్వ దవాఖానలకు కరోనా టెస్టుల కోసం ప్రజలు వచ్చారు. యాచారం ప్రభుత్వ దవాఖానలో బుధవారం 25మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రభుత్వ దవాఖానలో సుమారు వందమంది వరకు కరోనా టెస్టులు నిర్వహించారు.  నియోజకవర్గంలో రెండు కరోనా ర్యాపిడ్‌ టెస్టుల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగంగా మారింది.

పేదలకు ఇదో సదవకాశం 

కరోనా టెస్టుల కోసం ప్రైవేటు దవాఖానకు పోతే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని మాలాంటి ఎంతోమందికి టెస్టులు చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వమే నేరుగా యాచారంలో కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో ఉపయోగంగా ఉంది. ఈ కేంద్రాల్లో ఫలితాలు కూడా వెంటనే ఇస్తున్నారు. 

- బొగురమ్మ, గడ్డమల్లయ్యగూడ