సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 23:16:26

అరగంటలో ఫలితం

అరగంటలో ఫలితం

  • ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులతో సత్వర సమాచారం
  • రంగారెడ్డి జిల్లాలో 20 పీహెచ్‌సీలలో ఏర్పాట్లు
  • కరోనా టెస్టులు పెద్దసంఖ్యలో చేసేందుకు చర్యలు
  • బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లలో ప్రారంభమైన పరీక్షలు
  • మిగతా చోట్ల నేటి నుంచి షురూ 

కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు, ఫలితాలు వెంటనే వచ్చేలా ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌లలో బుధవారం నుంచి వీటిని ప్రారంభించగా.. సరూర్‌నగర్‌, రంగనాయకుల కుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవరంపల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గం, నందివనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరులలో గురువారం నుంచి షురూ చేయనున్నారు.  ఇప్పటి వరకు ఈ టెస్టులు ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో నిర్వహించేవారు. ఈ విధానంలో ఫలితాల వెల్లడికి ఆలస్యమవుతుండడంతో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పద్ధతిని ప్రారంభించారు.  

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి ప్రభు త్వం మరో అడుగు ముందుకేసింది. జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. జిల్లాలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌యాంటీజెన్‌ టెస్టులు ప్రారంభించారు. పరీక్ష యంత్రాలను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌లకు శిక్షణ ఇవ్వడంతో వారు ఈ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించనున్నారు. వాస్తవానికి కరోనా వ్యాప్తిచెందడం ప్రారంభమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం నుంచి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇన్ఫెక్షన్ల తీవ్రతను గుర్తించేందుకు యాంటీజెన్‌ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ సంఖ్యలో రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌-పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పద్ధతిలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే యాంటీజెన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలకు జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు గ్రామీణ జిల్లాలోని మరికొన్ని పీహెచ్‌సీ పరిధుల్లో యాంటీజెన్‌ పరీక్షలు చేపట్టారు. ప్రతి కేంద్రంలో రోజుకు 25 మందికి పైగా పరీక్షలు చేయనున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ వచ్చినవారి సన్నిహితులకు తొలి విడుతలో టెస్టులు చేస్తారు. రక్త నమూనాలు సేకరించిన 15 నుంచి 30 నిమిషాల్లో పరీక్ష ఫలితాలను నిర్ధారిస్తారు. అంతకుముందు ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తే 24 నుంచి 36 గంటలు పట్టేది.

పరీక్ష తర్వాత లక్షణాలు ఉండి.. నెగెటివ్‌ వస్తే ‘ఆర్టీపీసీఆర్‌'కే 

    శరీరంలోకి చేరిన రోగ కారకాన్ని యాంటీజెన్‌ అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఆ వెంటనే రోగ నిరోధక శక్తినిచ్చే వ్యవస్థ మోహరించే రక్షక భటులే యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు) అంటారు. ఇన్ఫెక్షన్‌ సోకిందా..? లేదా..? అనేది నిర్ధారించేందుకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయనున్నారు. వైరస్‌ సోకిన కొన్ని గంటల్లోనే ఈ టెస్టులు చేస్తే పాజిటివ్‌గా చూపిస్తుంది. ఇక వేళ వైరస్‌ అటాక్‌ చేయకపోతే నెగెటివ్‌ అని రిపోర్టు వస్తుంది. సాధారణంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలేవీ నిర్వహించరు. కానీ కోవిడ్‌-19 లక్షణాలు ఉండి నెగెటివ్‌ రిపోర్టు వస్తే మాత్రం వారిని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు పంపిస్తారు.

జిల్లాలో 20 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలు

  జిల్లాలో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో కోవిడ్‌-19 అధికంగా కేసులు నమోదవుతున్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. సరూర్‌నగర్‌, బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రంగనాయకులకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవరంపల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గం, నందివనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. 

162 మందికి కరోనా

    జిల్లాలో 162 మందికి కరోనా సోకింది. బుధవారం అర్బన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 106 కేసులు నమోదు కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతా ల్లో మరో 56 మందికి వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. జిల్లాలో కేసుల సంఖ్య 2309కి చేరింది. వీటిలో ఇప్పటివరకు 320 మంది కోలుకున్నారు. 1783 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వీరిలో 1520 మంది తమ ఇండ్లలో, 89 మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 33 మంది మృతిచెందారు. మిగిలిన యాక్టివ్‌ కేసులకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు నిర్వహించి 7679 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. బాలాపూర్‌లో 26, కందుకూరు 4, దుబ్బచర్ల 1, నర్కుడ 4, నార్సింగి 18, ఇబ్రహీంపట్నం 1, అబ్దుల్లాపూర్‌మెట్‌ 23, శేరిలింగంపల్లి 36, సరూర్‌నగర్‌ 31, మైలార్‌దేవరంపల్లిలో 18 చొప్పున 162 మందికి పాజిటివ్‌ అని తేలింది.