శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jul 01, 2020 , 23:18:26

పంచాయతీ భవనాన్ని ఎందుకు అప్పగించలేదు

పంచాయతీ భవనాన్ని ఎందుకు అప్పగించలేదు

వికారాబాద్‌ రూరల్‌ : రాళ్లచిట్టంపల్లిలో పెరిగే మొక్కలను రెవెన్యూ ప్లాంటేషన్‌లో పెంచాలని, నిర్మాణాలు పూర్తైన భవనాలను త్వరగా అప్పగించాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లచిట్టంపల్లి గ్రామంలో పర్యటించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాంపాండ్‌ పనులు, పాఠశాల భవనం, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. 2010లో నిర్మాణం పూర్తి చేసిన పంచాయతీ భవనాన్ని గ్రామ పంచాయతీకి ఎందుకు అప్పగించలేదని డీఈ రాజారత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనం పై కప్పు కూలుతుందని, కొత్త భవన నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేసి పాఠశాలకు అప్పగించేలా చూడాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలోని డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గతేడాది ఎన్ని మొక్కలు నాటారు, ఈ సారి ఎన్ని మొక్కలు నాటుతున్నారనే విషయాన్ని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పొలాల వద్ద ఏర్పాటు చేసిన ఫాంపాండ్‌ పనులను పరిశీలించి రాతి నిర్మాణం జరుగలేదని, త్వరగా పూర్తి చేయించాలని ఏపీవోను ఆదేశించారు. పొలాల వద్ద వరి పంటల కోసం ముందుగా సాగు చేస్తున్న జనుమును పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాళ్లచిట్టంపల్లిలో ఎక్కడ తవ్వినా రాళ్లు వస్తున్నాయని, చెట్లు పెంచడం ఇబ్బందిగా ఉందని అధికారులు తెలుపడంతో రాళ్ల మధ్యలో పెరిగే రావి, మర్రి, వేప, మోదుగ, కచ్చకాయ, కానుగ మొక్కలు పెంచాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ రవీందర్‌, ఎంపీవో నాగరాజు, ఏపీవో శ్రీనివాస్‌, ఇంజినీర్‌ నవీన్‌, కార్యదర్శి సుప్రియ పాల్గొన్నారు.