సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jun 30, 2020 , 23:23:49

భూసేకరణ వేగవంతం

భూసేకరణ వేగవంతం

  • త్వరలో 200మంది రైతులకు రూ.30కోట్ల పరిహారం
  • భూధాన్‌ బాధిత రైతులకు సైతం చెక్కులు రెడీ
  • కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌లలో 
  • 2వేల ఎకరాల భూసేకరణకు ప్రణాళిక
  • ఫార్మా రహదారుల ఏర్పాటుకు  
  • భూసేకరణ ముమ్మరం

యాచారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ ఏర్పాటుతో మండలానికి మంచి భవిష్యత్తు రానుంది. ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. తగిన ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి ప్రాంత ప్రజలకు మంచి జీవనోపాధి దొరుకనుంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాక వివిధ రకాల పనుల్లో తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు మంచిరోజులు రానున్నాయి.  యువతకు ఫార్మాసిటీలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరుకనున్నాయి. మేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్‌ గ్రామాలేకాదు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు తగిన ఉపాధి దొరుకనుంది. ఎన్నో ఏండ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న మండల ప్రజలు ఆర్థికంగా ఎదిగి తమ కుటుంబాలను పోషించుకోనున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మొత్తంగా ఫార్మాసిటీ ఏర్పాటుతో మండలానికి మహర్దశ పట్టనుంది. 

ముమ్మరంగా భూ సేకరణ

 ఫార్మాసిటీ ఏర్పాటు కోసం మండలంలో భూసేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. 2017, అక్టోబర్‌11న మేడిపల్లిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇప్పటికే మండల పరిధిలోని కుర్మిద్ద, మేడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన బాధిత రైతులకు తగిన పరిహారాన్ని సైతం అందజేశారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూములను ఇవ్వగా, మరికొంత మంది రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సైతం తమ భూములను ఇచ్చిన విషయం తెలిసిందే.  ఫార్మాకు సరిపడా భూములను సేకరించేందుకు అధికారులు గతంలోనే సర్వేలను ముమ్మరం చేశారు. 

ఫార్మాసిటీకి 19,333 ఎకరాల భూసేకరణే లక్ష్యం 

 కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామం కేంద్రంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి 2014లో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఔషధ రంగం దిగ్గజాలతో అప్పట్లో చర్చించిన సీఎం కేసీఆర్‌ వారితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పైగా కాలుష్యరహిత కంపెనీలు మాత్రమే ఏర్పాటు చేస్తామని ఔషధరంగం నిపుణులు హామీనివ్వడంతో ఫార్మాసిటీ ఏర్పాటుకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో కందుకూరు మండలంలో భూములను గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయేతర భూముల సేకరణపై మొగ్గుచూపింది. కేంద్ర పర్యావరణశాఖ, అటవీశాఖలు యాచారం మండలంలో అధికంగా అసైన్డ్‌ భూములు ఉండడంతో అటు వైపు మొగ్గుచూపాయి. మండలంలోని మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల్లోని అసైన్డ్‌మెంట్‌, కబ్జా భూముల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 19,333 ఎకరాల భూసేకరణకు అధికారులు నిర్ణయించారు. ఫార్మాసిటీకి నిమ్జ్‌ (జాతీయ పెట్టుబడుల మౌలిక ఉత్పత్తుల మండలి) హోదాను సైతం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు మరింత వేగవంతం చేశారు. 

మండలంలోని మేడిపల్లి, తాడిపర్తి, నానక్‌నగర్‌, కుర్మిద్ద గ్రామాల్లో ఇప్పటికే అసైన్డ్‌, కబ్జా భూములను సేకరించిన అధికారులు ప్రస్తుతం పట్టా భూముల సేకరణలో నిమగ్నమయ్యారు. మండలంలో ఇంకా 5507 ఎకరాల భూసేకరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాసిల్దార్‌, రెవెన్యూ అధికారులు తెలిపారు.

మండలంలో 5,507ఎకరాల భూసేకరణకు సిద్ధం

మండలంలో ఫార్మా ఏర్పాటు కోసం భూసేకరణ పక్రియను అధికారులు మరింత వేగవంతం చేస్తున్నారు. మండలంలో మొదటి విడుతలో 7,414 ఎకరాల అసైన్డ్‌, పట్టా భూములను సేకరించిన అధికారులు, ఇప్పటికే రైతులకు పరిహారాన్ని సైతం అందజేశారు. మరో విడుతగా మండలంలో 5,507 ఎకరాల భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో మేడిపల్లిలో 1,601 ఎకరాలు, తాడిపర్తిలో 1,492, కుర్మిద్దలో 1,738, నానక్‌నగర్‌లో 678 ఎకరాల భూమిని సేకరిస్తారు. కొంతమంది రైతులు ఫార్మా ఏర్పాటుకు పట్టా భూములిస్తామని స్వచ్ఛందంగా అధికారులకు అంగీకార పత్రాలను సమర్పించగా, మరికొంత మంది రైతులకు తమ భూములను ఇవ్వాలని అధికారులు నోటీసులను అందజేశారు. మొత్తంగా కందుకూరు, యాచారం మండలాల్లో 19,333 ఎకరాలను సేకరించనున్నట్లు అధికారులు అంటున్నారు. ఇందులో సుమారు 10,500 ఎకరాల భూమిని సేకరించారని, మరో 10,000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.   

రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ

ఫార్మాసిటీ రహదారులకు సైతం భూములను సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ను విడుదల చేసి సర్వే సైతం చేశారు. రూ.200 కోట్లకు పైగా నిధులతో ఫార్మా రహదారులు నిర్మించనున్నారు. కొన్ని రోజులుగా కందుకూరు మండలంలో శ్రీశైలం రహదారి నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాచారంలో ఇప్పటికే హద్దులను గుర్తించి రహదారులను చదును చేశారు. అటు శ్రీశైలం రహదారిని ఇటు నాగార్జునసాగర్‌ రహదారిని కలుపుతూ మీర్‌ఖాన్‌పేట, నజ్దిక్‌సింగారం, నందివనపర్తి గ్రామాల మీదుగా డబుల్‌ రోడ్డును నిర్మించనున్నారు. మండల కేంద్రం నుంచి నందివనపర్తి మీదుగా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట మైసమ్మగుడి వరకు రూ.48కోట్లతో ప్రస్తుత రోడ్డును డబుల్‌రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతోపాటు నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ వరకు రూ.29కోట్లతో డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనుంది. దీంతో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల లింకురోడ్లు 100 అడుగుల వెడల్పుతో డబుల్‌రోడ్డుగా విస్తరించడంతో అక్కడి ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోనున్నాయి. 

త్వరలో 200 మందికి రూ.30లక్షల పరిహారం

మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఫార్మా భూనిర్వాసితులకు 200మందికి రూ.30కోట్ల పరిహారాన్ని అతి త్వరలో అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామంలో ఉన్న మరో 130ఎకరాలకు పైగా ఉన్న భూదాన్‌ భూమికి సైతం పరిహారం అందించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమయ్యింది. అయితే కబ్జాలో ఉన్న రైతులకు మాత్రమే ఎకరాకు రూ.12.5లక్షల పరిహారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను సైతం అధికారులు సిద్ధం చేశారు. రెండు రోజుల్లో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తాసిల్దార్‌ నాగయ్య తెలిపారు. దీంతోపాటు కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాలకు చెందిన పట్టా భూముల సేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికోసం రైతుల జాబితాను సిద్ధం చేశారు. రైతుల నుంచి అంగీకారపత్రాలను తీసుకునేందుకు వారికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఆయా గ్రామాల్లో అదనంగా 2,000 ఎకరాల పట్టా భూములను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

రైతులందరికీ న్యాయం...

 ఫార్మాసిటీ ఏర్పాటుతో భూము లు కోల్పోతున్న రైతులందరికీ ప్రభు త్వం అండగా ఉంటుంది. ప్రతి బాధి త రైతుకు తగిన పరిహారం అంది స్తాం. ఫార్మాతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నా యి. ఐటీఐ, బీటెక్‌, ఎంటెక్‌ చదివిన యువతకు భవిష్యత్తు ఉంటుంది. అక్కడి ప్రాంత ప్రజలకే కా కుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. 

- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే

200 మంది రైతులకు పరిహారం...

ఫార్మాసిటీకి భూములిచ్చిన మేడిపల్లి గ్రామానికి చెందిన 200మంది రైతులకు రూ.30లక్షల పరిహారాన్ని త్వరలో అందజేయనున్నాం. రైతులకివ్వడానికి పరిహారం చెక్కులను సిద్ధం చేశాం. భూదాన్‌ భూములకు సంబంధించిన రైతులకు కూడా పరిహారాన్ని అందజేస్తాం. తాడిపర్తి, నానక్‌నగర్‌, కుర్మిద్ద గ్రామాలకు చెందిన పట్టా భూముల సేకరణకు జాబితాను సిద్ధం చేశాం. 

- నాగయ్య, తాసీల్దార్‌, యాచారం