గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 28, 2020 , 02:50:34

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

 కరోనా పట్ల  అప్రమత్తంగా ఉండాలి

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం : కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున.. ఇది మానవాళికి ఎంతో ముప్పుగా మారిందని.. నియోజకవర్గంలో రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున నియోజకవర్గ ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లోనే ఇండ్లలో నుంచి బయటకు రావాలని.. మాస్కులు ధరించాలని.. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నష్టపోయేది మనమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. 

ఇబ్రహీంపట్నంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 

  • 2గంటలకే దుకాణాలు మూసివేయాలని యజమానుల నిర్ణయం

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారస్థులు నిర్ణయించారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నంలోని అన్ని కిరాణా దుకాణాలు, వ్యాపార సముదాయాలన్నింటిని మధ్యాహ్నం నుంచే మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవల నియోజకవర్గంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి సరుకుల కొనుగోలు కోసం ఇబ్రహీంపట్నంకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దుకాణ, ఇతర వ్యాపార సంస్థలు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ప్రజలంతా అవసరం ఉంటేనే ఇండ్లనుంచి బయటకు రావాలని వర్తక సంఘం పిలుపునిచ్చింది.