ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 27, 2020 , 00:39:33

దసరా నాటికి రైతు వేదికలు

దసరా నాటికి రైతు వేదికలు

  • రూ.350కోట్లు కేటాయింపు  
  •  2046 చదరపు అడుగుల్లోనిర్మాణం
  • ఒక్కోదానికి రూ.20లక్షల వ్యయం
  • పరిగి నియోజకవర్గంలో   20 క్లస్టర్లలో నిర్మాణానికి చర్యలు
  • భూమి కేటాయింపు
  • త్వరలో పనులు ప్రారంభం

పరిగి : రైతు సంక్షేమ పథకాల అమలులో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సర్కారు మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులందరినీ సంఘటితం చేయడంతోపాటు వారందరూ ఒకచోటకు చేరి పంటల సాగు, మార్కెటింగ్‌పై చర్చించుకునేందుకు రైతువేదికలు నిర్మించనున్నది.  ఇప్పటికే రైతులకు అవసరమైన  సలహాలు ఇచ్చేందుకు 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి చొప్పున నియామకం చేపట్టారు. పంటల సాగు పద్ధతుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు సూచనలు చేయడం, తరచుగా శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు వీలుగా ఈ రైతువేదికల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకోసం ప్రభుత్వం రూ.350కోట్లు కేటాయించింది. రైతువేదికల నిర్మాణం ఎలా ఉండాలి, ఒక్కోదానికి ఎంత ఖర్చు చేయాలనే విషయాలపై స్పష్టత రాగా.. దీనికి సీఎం కేసీఆర్‌ ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 2,604 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. దసరా వరకు నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పంతో కసరత్తు చేస్తున్నది.

ఒక్కో క్లస్టర్‌కు ఒకటి..

పరిగి డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో మొత్తం 20 క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం చేపట్టనున్నారు. పరిగి మండలంలో 6, పూడూరులో 5, దోమలో 4, కులకచర్లలో 5 నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో రైతువేదిక నిర్మాణానికి సుమారు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో రూ.12లక్షలు వ్యవసాయశాఖ, రూ.8లక్షలు ఉపాధిహామీ పథకం నుంచి ఖర్చు చేయనున్నారు. రైతువేదికల నిర్మాణానికి స్థలాలు కూడా కేటాయించారు.  

సకల సదుపాయాలు..

 రైతు వేదికల్లో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. రైతులు, వ్యవసాయ విస్తరణాధికారుల కోసం సమావేశ మందిరాలు నిర్మించనున్నారు. ప్రతి రైతువేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రైతువేదిక నమూనాను సైతం ఖరారు చేశారు. రైతువేదికలో ఒక హాల్‌, రెండు ప్రత్యేక గదులు, టాయ్‌లెట్లు నిర్మించనున్నారు. సుమారు 150 మంది కూర్చునే విధంగా 1498 చదరపు అడుగుల వేదికతో హాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.  వివిధ పంటల సాగులో రోజురోజుకూ వస్తున్న అధునాతన విధానాలను రైతులకు తెలియజేయడం, క్రాప్‌కాలనీల ఏర్పాటుతో ఆయా పంటలు సాగు చేసిన రైతులకు విడివిడిగా సమావేశాలు నిర్వహించేందుకు ఈ రైతువేదికలు ఉపయోగపడనున్నాయి. క్లస్టర్‌ పరిధిలోని ఆయా గ్రామాల రైతుబంధు సమితి సభ్యులు సైతం ఇక్కడే సమావేశాలు నిర్వహించుకోవచ్చు.  ఈ వానకాలం నుంచి నియంత్రిత విధానంలో పంటల సాగును ప్రభుత్వం అమలు చేస్తున్నది. భవిష్యతులో క్రాప్‌కాలనీలు, ఇతర వినూత్నమైన కార్యక్రమాల అమలుతో రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో రైతువేదికల నిర్మాణం ప్రాధాన్యం సంతరించుకున్నది.  

రైతులకు ఉపయోగం..

ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రైతు వేదికలు రైతులకు చాలా ఉపయోగకరంగా మారనున్నాయి. ప్రతి క్లస్టర్‌లో ఒక రైతువేదిక నిర్మాణంతో సంబంధిత గ్రామాల రైతులకు పంటల సాగులో కొత్త విధానాలు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించడానికి వీలుంటుంది. రైతులు ఒకే దగ్గర సమావేశమై పంటల సాగు, మార్కెటింగ్‌పై చర్చించుకోవడానికి వేదికగా నిలుస్తాయి. 

-బోయిని లక్ష్మయ్య,  దోమ మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్‌