మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 23:21:11

హరితహారంతో తెలంగాణకు నూతన శోభ

హరితహారంతో తెలంగాణకు నూతన శోభ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణకు ఆకుపచ్చని మణిహారంగా హరితహారం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 33 శాతం మేరకు అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలన్నారు. ఆరో విడుత హరిత హారాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు పడమటి కంచ అటవీ ప్రాంతం, బడంగ్‌పేట్‌, మోహబ్‌నగర్‌, రావిర్యాల, కమాన్‌, కొంగర కలాన్‌, చేవెళ్ల, కౌకుంట్ల, ఆలూరు, దామరగిద్ద తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేసి హరితహారం మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌, డీపీవో పద్మజారాణి, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్‌ తరాలకు మంచి జీవన ప్రమాణాలను అందిస్తాయని పేర్కొన్నారు. మొట్టమొదటి హరితహారాన్ని సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలోనే ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా మొత్తం వైశాల్యం 7.5 లక్షల హెక్టార్లు ఉండగా.. అందులో కేవలం 29,282 హెక్టార్లలోనే అడవులు ఉన్నాయని, అంటే కేవలం ఆరు శాతంలోపే అడవుల విస్తరణ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా 33 శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలంటే మరో 1.87 లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకై ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశామన్నారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే ఇంత పెద్దస్థాయిలో మొక్కలు నాటడం సాధ్యం కాదని, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యువకులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నాటిన మొక్కల పరిరక్షణకై ప్రత్యేకంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను కొనుగోలు చేశామన్నారు.

ప్రస్తుత హరితహారంలో అన్ని శాఖలు కలిసి దాదాపు కోటి మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. హరితహారం నిర్వహణకు నిధుల కొరత లేదని, స్థానిక సంస్థల్లో పది శాతం నిధులు హరితహారానికి కేటాయించినట్లు వివరించారు. అడవుల పెంపకంపై దృష్టి సారించి మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లు సబితారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 356 హెక్టార్లలో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు. 34 ప్రభుత్వ శాఖల సమన్వయంతో హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నాటిన మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించినట్లు మరోసారి గుర్తు చేశారు. యాచారంలో క్రికెటర్‌ అంబటిరాయుడు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యటించి హరితహారం కార్యక్రమాన్ని వీక్షించారు. 

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ

పరిగి : మొక్కల పెంపకంపైనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందని మంత్రి సబితారెడ్డి అన్నారు. పరిగి మండలం సాలిప్పలబాటతండాలోని అటవీ భూమిలో, పరిగి పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు మున్సిపల్‌ పార్కు స్థలంలో మంత్రి, ఎంపీ రంజిత్‌రెడ్డి, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, యాదయ్యలతో కలిసి మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ప్రతి ఇంటి ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా, అటవీ భూముల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాల్లో హరిత తెలంగాణ ఏర్పడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ పార్కులు,   మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహిస్తుందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్‌, ఎంపీపీ అర విందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు  పాల్గొన్నారు.