ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 01:00:55

రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు

 రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ  :   రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.100.36 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ రహదారులకు మహర్దశ కలుగనున్నదని తెలిపారు. పీఎంజీఎస్‌వై పథకం కింద రంగారెడ్డి జిల్లాలో 84.93కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి కోసం రూ.52 కోట్ల 26లక్షల 16వేలు, వికారాబాద్‌ జిల్లాలో 83.19 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.50కోట్ల 10లక్షల 37వేలు విడుదలైనట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో 13.10 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.6కోట్ల 87లక్షల 34వేలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 13.10కిలోమీటర్ల రోడ్లకు రూ.6కోట్ల 87లక్షల 34వేలు, మహేశ్వరంలో 26.22 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.18కోట్ల 42లక్షల 41వేలు, షాద్‌నగర్‌లో 23 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.13కోట్ల 96లక్షల 40వేలు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాలకు మొత్తం 83.19 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.50.10 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు.