గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 23, 2020 , 00:04:36

కరోనా కట్టడిలో మేము సైతం..

కరోనా కట్టడిలో మేము సైతం..

కొత్తూరు: కరోనా వ్యాధి నియంత్రణలో వైద్య సిబ్బంది చేసిన, చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి అన్నారు. షాద్‌నగర్‌ డివిజన్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున కరోనా పరీక్షలు చేశారు. కొత్తూరు పంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరిన్ని సేవలు అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. వైద్యసిబ్బందికి మరిన్ని సలహాలు, సూచనలు ఇచ్చి వారిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు కరోనాను కట్టడి చేసేందుకు చైతన్యం అవుతున్నారు. కార్యక్రమంలో డాక్టర్లు తుమ్మల దామోదర్‌, రామకృష్ణ, సుమన్‌, ఫాల్గుణీదేవి, లక్ష్మీఝాన్సి, కవిత, జిల్లా డెమో అధికారి శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

కరోనాపై అవగాహన

  కులకచర్ల: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కులకచర్ల సీహెచ్‌వో, జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌ పేర్కొన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని చాపలగూడెం గ్రామానికి ముంభై నుంచి వచ్చిన వారికి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 28 రోజుల వరకు హోంక్వారంటైన్‌లోనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త జయమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. 

డిజిటల్‌ థర్మామీటర్‌తో పరీక్షలు 

దోమ: కరోనా వ్యాధి బారినపడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సర్పంచ్‌ రాజిరెడ్డి అన్నారు. సోమవారం దోమ మండల కేంద్రానికి ఇతర గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు డిజిటల్‌ థర్మామీటర్‌తో  పరీక్షలు చేయించారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చిన ప్రజలు, గ్రామస్తులు సహకరించి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

  వ్యాపారుల స్వీయ నియంత్రణ

తాండూరు:  వ్యాపారులు కొవిడ్‌-19 నియంత్రణకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని నిర్ణ యించుకున్నారు. 22వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ ఈ సమయం పాటించాలని వ్యాపార సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. 

సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు 

పరిగి : పట్టణంలోని కిరాణం, వస్త్ర, చెప్పుల దుకాణాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచాలని ఆయా సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, చెప్పుల దుకాణాల అసోసియేషన్‌ అధ్యక్షుడు నజీర్‌, ఖాసిం, కిరాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముక్కు శేఖర్‌ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ మంగళవారం నుంచి అందరూ దీనిని పాటించాలని తీర్మానించారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా దుకాణాలు మూసివేయాలని  పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా అసోసియేషన్‌ల నాయకులు ఆకారపు శ్రీనివాస్‌, హస్నాబాద్‌ రాకేశ్‌, యాదగిరి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.