ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 17, 2020 , 23:13:33

ధాన్యం సేకరణ @ రూ.44 కోట్లు

ధాన్యం సేకరణ @ రూ.44 కోట్లు

  • డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు
  •  రైతుల ఖాతాల్లో చెక్కులు జమ
  • పీఏసీఎస్‌ల ద్వారా 10, డీసీఎంఎస్‌ ద్వారా 8 కొనుగోలు కేంద్రాలు
  • 6437 మంది రైతుల నుంచి 30వేల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం 
  • 23,974 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ   
  • రూ.44.09 కోట్లకు రూ.32.51 కోట్లు చెల్లింపులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో వరి ధాన్యం సేకరణను అధికారులు పూర్తి చేశారు. నిర్దేశిత ధాన్యం సేకరణలో యంత్రాంగం విజయవంతంగా ముగించారు. యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ఆదేశించింది. అయితే పంట చేతికి వచ్చిన పమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రైతుల పాలిట శాపంగా మారింది. దళారుల చేతిలో కర్షకులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. దీంతో ఏప్రిల్‌ నెలలో జిల్లా వ్యాప్తంగా 18 మద్దతు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూర్చింది. దీంతో తొలిసారి రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు వచ్చాయి.  జిల్లాలో 6,437 మంది రైతుల నుంచి 23,974 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ నెల 8వ తేదీ వరకు కొనుగోళ్లు జరిగాయి. 

18 కేంద్రాలు ..

  జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి 14,917 హెక్టార్లలో వరిసాగు చేశారు. 89,502 మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేశారు. పంట చేతికందుతున్న సమయంలో కరోనా వైరస్‌ ప్రబలడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయితే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎక్కడిక్కడ ధాన్యం సేకరణ కేంద్రాలు తెరిచింది. ‘గ్రేడ్‌ ఏ’రకం ధాన్యానికి రూ.1835, సాధారణ పంట రకానికి రూ.1815 ధర నిర్ణయించింది. కాగా జిల్లాలో 18 మద్దతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌లకు అప్పగించింది. వీటి ద్వారా రైతుల నుంచి అధికారులు 23,974 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 

రూ.44.09కోట్ల ధాన్యం సేకరణ ..

  జిల్లాలోని 18 మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో రూ.44.09 కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.32.51 కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.11.53 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు, గిడ్డంగులకు తరలించారు. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో యాసంగిలో సాగైన ధాన్యం కొనుగోలుకు రైతులకు ఉపశమనం లభించింది. ధాన్యం అమ్మకానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.

రూ.32.51 కోట్ల చెల్లింపులు..

  జిల్లాలో 18 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులు ఎలాంటి ఇబ్బంది పడలేదు. ‘గ్రేడ్‌ ఏ’రకం ధాన్యానికి  రూ.1835, సాధారణ పంట రకానికి  రూ.1815 ధర నిర్ణయించాం. రైతుల ఖాతాల్లోకి చెక్కులు జమ చేశాం. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 10, డీసీఎంఎస్‌ ద్వారా 8 చొప్పున మొత్తం 18 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లాలో 6,437 మంది రైతుల నుంచి 23,974 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ నెల 8వ తేదీ వరకు కొనుగోళ్లు జరిగాయి. 18 మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో రూ.44.09 కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రూ.32.51 కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.11.53 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ వారంలో మిగిలిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. 

-జనార్దన్‌రెడ్డి, డీసీవో, రంగారెడ్డి