గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 11, 2020 , 23:27:49

హరిత లక్ష్యాన్ని సాధిద్దాం

హరిత లక్ష్యాన్ని సాధిద్దాం

  • మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేసుకోవాలి
  • ప్రతి మున్సిపాలిటీలో పెద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయాలి
  • మొక్కల సంరక్షణకు ఫైబర్‌ట్రీగార్డులు ఉపయోగించాలి..
  • గ్రీన్‌ బడ్జెట్‌కు భారీగా నిధులు కేటాయింపు
  • యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి 
  • అటవీశాఖ సాంకేతిక సహకారాన్ని తీసుకోండి
  • అధికారులకు రంగారెడ్డి  కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఆదేశం

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెంటనే మౌలిక సదుపాయాలు చేపట్టాలన్నారు.  జిల్లాలో మొక్కలు నాటేందుకు ఇప్పటి వరకు 20,890 గుంతలు తవ్వి సిద్ధంగా ఉన్నాయని, వీటిని మరింతగా పెంచాలని ఎంపీడీవోలకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

యుద్ధ ప్రాతిపదికన గుంతల తవ్వకం

జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ప్రత్యేకంగా గ్రీన్‌ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో చెట్లు నాటడం, నగర, గ్రామాల సుందరీకరణ చేపట్టాలని తెలిపారు. రహదారుల వెంట నాటే మొక్కలు కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని, ఈ సామాజిక వనాల పెంపుకోసం మొక్కలను అటవీ శాఖ నుంచి సేకరించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రస్తుత సంవత్సరంలో ప్రతీ అర్బన్‌ లోకల్‌ బాడీలో కనీసం ఒక నర్సరీ, ఒక పార్కు ఏర్పాటుతో క్షేత్రం, దట్టమైన ట్రీ పార్క్‌లను పెంచాలని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారుల వెంట, ఇతర ప్రాంతాల్లో చింత వనాలను విరివిగా పెంచాలని కోరారు. రహదారుల వెంట చేపట్టే గుల్‌ మొహర్‌, పగోడా మొక్కలను ఒకే వరుసలో మాదిరిగా కాకుండా రెండు, మూడు వరుసల్లో నాటాలని, దీనివల్ల చెట్లు దట్టంగా పెరిగి రహదారులకు అందం వస్తుందని పేర్కొన్నారు.

ఉద్యానవన ఏర్పాటుకు కృషి

ప్రతి మున్సిపాలిటీతో పాటు జిల్లా కేంద్రంలో స్థల లభ్యత బట్టి ఒక పెద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు ఉపయోగించే ఇనుప ట్రీ గార్డులకు బదులుగా ఫైబర్‌వి ఉపయోగించాలని తెలిపారు. తద్వారా ఒక్కో ఫైబర్‌ ట్రీ గార్డుకు రూ.160 లోపే వ్యయం కావడంతో పాటు ఎవరూ ఎత్తుకెళ్లే పరిస్థితి ఉండదని కలెక్టర్‌ స్పష్టంచేశారు. ఆరు ఫీట్ల మొక్కలను నాటితే, ఒక్కొక్క మొక్క వ్యయం రూ.160 అయినప్పటికీ, వాటి పెంపునకు కేవలం రూ.40 వ్యయం మాత్రమే అవుతుందని తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటిన అనంతరం మంచి ఫలితాలు వచ్చిన వనాలపై ముందు ఏవిధంగా ఉంది, ప్లాంటేషన్‌ అనంతరం ఏవిధంగా ఉందనే వివరాలను సామాజిక మాద్యమాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలుపాలని కలెక్టర్‌ సూచించారు. 

ప్రతి గ్రామంలోనర్సరీ తప్పనిసరి

ప్రతీ పంచాయితీ, మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా ఒక నర్సరీ ఉండాలని సీఎం ఎన్నో సార్లు ప్రకటించారని, ఇదే అంశాన్ని రానున్న కలెక్టర్ల సమావేశంలో కూడా సమీక్షిస్తారని వెల్లడించారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు స్థానిక అటవీ శాఖ అధికారుల సాంకేతిక సహకారాన్ని పొందాలని, ప్రధానంగా ఏ నేలల్లో, ఎలాంటి మొక్కలు నాటాలో అటవీ శాఖ అధికారులు తగు సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు.  ప్రతీ మొక్కకు తప్పనిసరిగా ట్రీ గార్డు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా మొక్క పడిపోకుండా ఉండడమే కాకుండా రక్షణ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. గత హరిత హారాల్లో నాటిన మొక్కల్లో ఏవైనా చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటాలని తెలిపారు. గ్రీన్‌ బడ్జెట్‌లో భారీ స్థాయిలో నిధులు కేటాయించి రాష్ట్రంలో హరిత కవరేజికి గణనీయంగా పెంపొందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.