ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 11, 2020 , 00:16:31

జిల్లా దవాఖానలోనే ‘కొవిడ్‌' చికిత్స

జిల్లా దవాఖానలోనే ‘కొవిడ్‌' చికిత్స

  • 20 బెడ్లతో ఐసోలేషన్‌ కేంద్రం
  • బుధవారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు
  • మొత్తం 415కు  చేరిన రోగుల సంఖ్య 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాధిగ్రస్తులకు తమ ఇండ్ల వద్దనే వైద్యం అందుతున్నది. బాధితుల ఇండ్లలో కనీస సదుపాయాలు లేకుంటే వారికోసం అధికారులు కొండాపూర్‌ జిల్లా దవాఖానలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న జిల్లా వాసులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వెంటిలేటర్స్‌తో పాటు ఇతర వైద్య పరికరాలు సమకూరుస్తున్నారు. 20 బెడ్లకు పైగా ఏర్పాట్లు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కాగా, బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. గ్రామీణ జిల్లాతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో కలిపి, బుధవారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ ప్రకటించింది. జిల్లాలోని బాలాపూర్‌లో 2, నార్సింగిలో 3, ఇబ్రహీంపట్నంలో 1, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2, సరూర్‌నగర్‌లో 3, ఆమనగల్లులో 2, మైలార్‌దేవరంపల్లిలో 1, శేరిలింగంపల్లిలో 2, షాబాద్‌లో 1 చొప్పున 17 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 415కు చేరింది.