శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jun 09, 2020 , 23:48:21

పల్లె, పట్టణ ప్రగతితో ప్రజల్లో పెరిగిన అవగాహన

పల్లె, పట్టణ ప్రగతితో ప్రజల్లో పెరిగిన అవగాహన

  • పారిశుద్ధ్య కార్యక్రమాలతో మారిన పరిస్థితులు
  • నెరవేరుతున్న ప్రభుత్వ లక్ష్యం
  • సీజనల్‌ వ్యాధుల నివారణలో ఫలిస్తున్న అధికారుల కృషి
  • సమస్యలు గుర్తించడం నుంచి పరిష్కరించడం వరకు పక్కా  ప్రణాళికలు
  • ప్రత్యేక అధికారుల నిరంతర పర్యవేక్షణ
  • ఫలితాన్నిచ్చిన పకడ్బందీ చర్యలు

మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో అధికారులు సఫలమయ్యారు. ఈ నెల 1 నుంచి 8 వరకు నిర్వహించిన మూడో విడుత కార్యక్రమాలతో గ్రామాలు, మున్సిపాలిటీలు కొత్త రూపు సంతరించుకున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు. రంగారెడ్డి  జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో, వికారాబాద్‌ జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 3 కార్పొరేషన్లు,12 మున్సిపాలిటీలలో, వికారాబాద్‌ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చి సీజనల్‌ వ్యాధులు రాకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. వారు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్త పడ్డారు. సమస్యలు గుర్తించడం నుంచి వాటిని పరిష్కరించడం వరకు అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో ఈ విడుత కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.  

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ/ వికారాబాద్‌: ఈ నెల ఒకటి నుంచి నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలు విశేష ఫలితాలన్నిచ్చాయి. సీజనల్‌ వ్యాధులు అరికట్టడానికి, పారిశుధ్యంపై అవగాహన పెంచి ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేయడానికి అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరిశుభ్రత పాటించడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించారు.

పనితీరుపై నివేదికలు..

గతేడాది కంటే ఈ ఏడాది గ్రామ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. కేటాయించిన మండలాలను జిల్లా అధికారులు పర్యటించి,ఆకస్మికంగా సందర్శించి పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. పనిలో అలసత్యం ప్రదర్శించిన కొందరిపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు సైతం జారీ చేశారు. 

ఉత్తమ ఫలితాలు..

పల్లె ప్రగతి కార్యక్రమంతో ఉత్తమ ఫలితాలువచ్చాయి. మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చింది. ఇదే స్ఫూర్తితో మూడో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. గ్రామాలు బాగుపడాలనే ఉద్ధేశంతో గ్రామ కార్యదర్శి నుంచి పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేశారు. గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని ఇప్పటికే సీఎం కేసీఆర్‌  భరోసా కల్పించారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి అదనంగా నిధులు వచ్చాయి. చెట్లు పెంచే పనులకు,చెత్త ఎత్తివేసే పనులకు నరేగా నిధులు వాడుకున్నారు. 

సమస్యల గుర్తింపు..పరిష్కారం..

జిల్లాలో సమస్యలను గుర్తించి పరిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ సమస్యలను గుర్తించి మరమ్మతులు,నిర్మాణాలు పూర్తి చేశారు. జిల్లాలో 3291 సైడ్‌ డ్రైన్లు గుర్తించగా 3199 చోట్ల  మరమ్మతులు చేపట్టారు. 2289 శిథిలావస్థలోని ఇండ్లు గుర్తించి 2115 ఇండ్లను తొలగించారు. 3681 సర్కార్‌ తుమ్మ, పిచ్చి మొక్కల ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించగా, 3582 ప్రాంతాల్లో  వీటిని తొలగించారు. 4598 ఓపెన్‌ ప్లాట్లలో 4479 చోట్ల క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చేపట్టారు. 1724 పల్లపు ప్రాంతాలను గుర్తించి 1653 ప్రాంతాల్లో సమస్యను  పరిష్కరించారు. 2249 ప్రాంతాల్లో రోడ్ల్ల గుంతలను గుర్తించగా, 2116 చోట్ల  పూడ్చివేశారు.  803 కాల్వలను గుర్తించి 750 చోట్ల మరమ్మతులు జరిపించారు. 1598 ప్రాంతాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులను క్లోరినేషన్‌ చేయడానికి గుర్తించి..1574 ప్రాంతాల్లో పూర్తి చేశారు. 1752 వాటర్‌ సప్లయ్‌ పైపులు మరమ్మతులు చేసేందుకు గుర్తించి 1684  పైపులకు మరమ్మతు చేపట్టారు. జిల్లాలో చేపట్టిన పనుల నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. 

   వికారాబాద్‌ జిల్లాలో...

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పట్టణాలే కాకుండా గ్రామ పంచాయతీల్లో సైతం విజయవంతంగా పూర్తయ్యింది. దీనిలో భాగంగా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పారిశుద్ధ్య పనులు చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారి  ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, రోడ్లపై నీరు నిల్వ ఉండే గుంతలను పూడ్చడం వంటి కార్యక్రమాలను నిర్విరామంగా చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారు. అదే విధంగా సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.  ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో పాటు సర్పంచులు తదితరులు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి లోతట్టు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో ప్రాంతాల వారీగా గుర్తించి ఎనిమిది రోజుల్లో వాటిని పూడ్చివేయించారు. గ్రామాల్లోని వీధుల్లో యాంటీ లార్వా, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని మొరంతో మరమ్మతులు చేశారు. పైపులైన్‌ లీకేజీలను సరిదిద్దారు. గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రం ద్వారా స్ప్రే చేసి రోగకారక జీవులు చేరకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, క్లోరినేషన్‌ చేయడం, నిరుపయోగంగా ఉన్న బోర్‌వెల్స్‌ను మొరంతో పూడ్చడం వంటి పనులు విస్తృతంగా నిర్వహించారు. 

రంగారెడ్డిలో లక్ష్యం దిశగా... 

రంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతి విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌  తొలి,రెండో విడుత పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో మొదటి విడతలో 30 రోజుల ప్రణాళిక చేపట్టగా,రెండో విడుతలో 11 రోజుల పాటు నిర్వహించారు. ఈయేడాది జూన్‌ 1వ తేదీ నుంచి 8 వరకు మళ్లీ మూడో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 560 గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి, 3 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో అధికారులు,ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. పల్లెలో పలు అభివృద్ధి పనులను చేపట్టి వాటిని పూర్తి చేశారు.  జిల్లా అన్ని చోట్ల పంచాయతీ సమావేశాలు, పాదయాత్రలు, గార్బేజ్‌ కలెక్షన్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో పల్లె ప్రగతిని విజయవంతమైంది. 

మున్సిపాలిటీల వారీగా చేపట్టిన పనులు

  •  వికారాబాద్‌ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ప్రారంభించినప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్‌ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని వార్డుల్లో పనులు చేపట్టారు. పట్టణంలోని 34 వార్డుల్లోని మురుగు కాలువల్లో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి వార్డులో ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్ల చొప్పున ఉపయోగించి రోడ్లపై గుంతలను పూడ్చివేసి, ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలను తొలగించారు.  అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టి దిబ్బలు, పిచ్చి మొక్కలను తొలగించి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న 100 మంది పారిశుధ్య సిబ్బందితో పనులను చేపట్టారు. 
  • l పరిగి మున్సిపాలిటీలో 15 వార్డుల్లో డ్రైనేజీల పూడికతీత పనులను చేపట్టారు. పట్టణవ్యాప్తంగా మొత్తం 38.96 కిలోమీటర్ల వరకు పూడికలను తీసి అన్ని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు.  ప్లాస్టిక్‌ వినియోగంవల్ల అనర్థాలను ప్రజలకు వివరించారు. అన్ని వార్డుల్లోనూ మురుగు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను జేసీబీల సహాయంతో తొలగించారు. ప్రజలను భాగస్వామ్యం చేసి కాలనీల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.  
  •  తాండూరు  మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో మున్సిపల్‌ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు.  రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజనల్‌ వ్యాధులు దరి చేరకుండా పరిశుభ్రతలో భాగంగా కాలనీల్లో రసాయనాలు స్ప్రే చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతో పాటు వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేశారు. 
  • l కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను మొత్తం 24 మంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులతో మురుగు కాలువల సిల్ట్‌ తొలగింపు కార్యక్రమంతో పాటు ప్రతి వార్డులో శానిటేషన్‌ కార్యక్రమం, ఫాగింగ్‌, హరితహారం వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా మురుగు కాలువలను శుభ్రం చేశారు. 

 ముగిసిన  పట్టణ ప్రగతి

వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం ముగిసింది. 8 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర మున్సిపల్‌ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణాల్లోని అన్ని వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జోన్లు, కమిటీల వారిగా నియమించిన అధికారులు, వార్డు కౌన్సిలర్లు కీలకపాత్ర పోషించి తమతమ వార్డులను శుభ్ర పరిచారు.