బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jun 09, 2020 , 01:08:30

త్వరలో పట్నం వాసుల కల సాకారం

త్వరలో పట్నం వాసుల కల సాకారం

శివన్నగూడ నుంచి ఎత్తిపోతల ద్వారా చెరువులకు నీళ్లు

మూడు చోట్ల రిజర్వాయర్లు..,

ఏడాది పొడవునా పుష్కలంగా సాగు నీరు

డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం..

హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌

టెండర్లు పూర్తవగానే మొదలుకానున్న పనులు

డిండి ఎత్తిపోతలకు అనుసంధానంగా రాచకొండ గుట్టల్లో నిర్మిస్తున్న శివన్నగూడ రిజర్వాయర్‌తో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సస్యశ్యామలంగా మారనున్నది. ఈ రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పట్నం పరిధిలోని పెద్ద చెరువుతో పాటు 123 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. ముప్పైవేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో 90చెరువులు, కుంటలకు,  మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 4చెరువులు, రాజేంద్రనగర్‌లో 5 చెరువులు, షాద్‌నగర్‌లో 24చెరువులు, జడ్చర్లలో ఐదు చెరువులను నింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం మూడుచోట్ల చిన్న పాటి రిజర్వాయర్లను నిర్మించేందుకు రూపొందించిన డీపీఆర్‌కు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ సైతం లభించింది. దీంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రతి ఏడాది మూడు టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉండగా, భవిష్యత్‌లో సాగు విస్తీర్ణం భారీగా పెరిగి వ్యవసాయం పండుగలా మారుతుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం : అసాధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుసాధ్యం చేశారు. అపర భగీరథుడిగా పేరున్న ముఖ్యమంత్రి కరువు పీడిత రాచకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడ రిజర్వాయర్‌కు నీటిని తీసుకురావడంతోపాటు ఈ రిజర్వాయర్‌ నుంచి నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మేడ్చ ల్‌ జిల్లాలకు సాగు, తాగునీరందించే బృహత్తర పథకానికి బీజం వేశారు. శివన్నగూడ రిజర్వాయర్‌ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 123 చెరువుల్లో నీరు నింపడంతోపాటు 30వేల ఎకరాలకు సాగునీరు ఈ రిజర్వాయర్‌ నుంచి అందించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 90చెరువులు, కుంటలకు ఈ పథకం ద్వారానే నీరందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 4 చెరువులు, రాజేంద్రనగర్‌లో 5, షాద్‌నగర్‌లో 24, జడ్చర్లలో 5 చెరువులను ఈ రిజర్వాయర్‌ ద్వారా నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా రాచకొండ ఎత్తిపోతల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించగా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)కు ్రప్రభుత్వం గ్రీన్‌ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి తెలిపారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు నల్గొండ జిల్లాలో కొంతభాగం, ఫ్లోరోసిస్‌ సమస్యతోపాటు కరువుతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంత ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది. 

డిండి టు రాచకొండ..

శివన్నగూడం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఆప్రోచ్‌ ఛానల్‌ ద్వారా రాచకొండ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. 1.157క్యూసెక్కుల నీటిని మూడు లిప్టుల ద్వారా 378 ఎత్తుల మీటర్ల ఎత్తుకు తరలించేందుకు ఈ డీపీఆర్‌లో రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా మర్రిగూడ మండలం కుదాభక్షపల్లి వద్ద పంపింగ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి 40 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటర్ల ద్వారా 2.5 డయామీటర్ల వ్యాసార్థంగల రెండు పైపులతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ లిప్టుల ద్వారా కరువుతో కొట్టుమిట్టాడుతున్న నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీటి సమస్య తీరనుంది.

శివన్నగూడ రిజర్వాయర్‌తో ఇబ్రహీంపట్నంకు మహర్దశ..

శివన్నగూడ రిజర్వాయర్‌ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 123 చెరువులకు సాగునీరు అందించే ప్రక్రియను డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో దాదాపు  30వేల పై చిలుకు ఎకరాలకు ఈ చెరువుల ద్వారా సాగునీరు అందే అవకాశాలున్నాయి. శివన్నగూడ రిజర్వాయర్‌ నుంచి లిప్టుల ద్వారా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని వాయిల్లపల్లికి మొదటి లిప్టు ద్వారా నీటిని తీసుకువచ్చి అక్కడి నుంచి 500 మీటర్ల టన్నెల్‌ ద్వారా వాయిల్లపల్లి సమీపంలోని రెండు కొండల మధ్య 1200ఎకరాల్లో మరో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల శివగంగాగుట్ట వద్ద అతి ఎత్తైన ప్రదేశంలో మరో రిజర్వాయర్‌ నిర్మించడానికి డీపీఆర్‌లో పొందుపర్చారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా కందుకూరు మండలం ముచ్చర్లకు నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుట్ల సమీపంలోని నిర్మించే రిజర్వాయర్‌ నుంచి మంచాల మండలంతోపాటు ఇబ్రహీంపట్నం ఈస్ట్‌ప్రాంతం, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతానికి తాగు, సాగు నీరందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. గున్‌గల్‌, తులేకలాన్‌ మధ్య నిర్మించే రిజర్వాయర్‌ నుంచి యాచారం మండలంలోని అనేక గొలుసుకట్టు చెరువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే రిజర్వాయర్‌ నుంచి మహేశ్వరం మండలంలోని రావిర్యాల చెరువుతోపాటు ఇబ్రహీంపట్నం వెస్ట్‌ప్రాంతానికి కూడా నీరందించే ప్రయత్నాలను డీపీఆర్‌లో సిద్ధం చేశారు. 

రూ.1.72 కోట్లతో పూర్తయిన డీపీఆర్‌..

శివన్నగూడ ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జల్లాలకు సాగునీరు అందించే ప్రణాళికకు సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ.1.72కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీరింగ్‌ ఫోరం ఆధ్వర్యంలో సుమారు సంవత్సరం పాటు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అవసరమైనచోట రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులకు నీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నాడు వ్యతిరేకించిన వారి నోళ్లకు తాళాలు..

2015 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సభలోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీడీపీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. తాను నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు తీసుకురావడం కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి ముందే ప్రకటించారు. దీంతో అనేకసార్లు ఇబ్రహీంపట్నం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇబ్రహీంపట్నంకు సాగునీరు అందిస్తానని హామీనిచ్చారు. ప్రాజెక్టు రిపోర్టులో కొంత ఆలస్యం జరుగడంతో ప్రతిపక్షాలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సాగునీరు తీసుకు రాకపోతే రాజీనామా చేయాలని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నింటికి చెక్‌ పెట్టే విధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించడానికి ముందుకొచ్చారు. 

నియోజకవర్గానికి ఏటా 3 టీఎంసీల నీరు..

శివన్నగూడ రిజర్వాయర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు టీఎంసీల నీటిని వాడుకునే విధంగా డీపీఆర్‌లో పొందుపర్చారు. మూడు టీఎంసీల నీటిని ప్రతియేటా నియోజకవర్గంలోని 123చెరువులు నింపడంతోపాటు సాగునీరు అందించడం కోసం వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నో ఏండ్లుగా కోరుకుంటున్న సాగునీటి కల నెరవేరనుంది. 

ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుంది 

నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సాగు, తాగునీరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో శివన్నగూడ ఎత్తిపోతల ద్వారా తీరనున్నది. ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావడం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరా. అందుకనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కోరికను మన్నించి నియోజకవర్గానికి సాగునీరు అం దించే డీపీఆర్‌లో పెద్దపీట వేశారు. నియోజకవర్గంలోని 123 చెరువులను నింపడానికి అనుకూలంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడంతో 30వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నియోజకవర్గం కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతున్నందున వర్షం కోసం వరుణయాగం కూడా చేశా. మాల్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టా. వీటన్నిటి ఫలితంగానే నియోజకవర్గానికి సాగునీటి సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో తీరనున్నది.

- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం