శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jun 08, 2020 , 00:28:55

‘పది గంటలకు పది నిమిషాలు’లో భాగస్వాములు కావాలి

‘పది గంటలకు పది నిమిషాలు’లో భాగస్వాములు కావాలి

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆనంద్‌ అన్నారు. వానకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

వికారాబాద్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని రామయ్యగూడ, గిరిగెట్‌పల్లి కాలనీలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. సమస్యలను గుర్తించి త్వరితగతిన పనులు నిర్వహించేలా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. 

కాలనీలలోని మురుగు కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పాడుబడ్డ బావులను పూడ్చి, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. వానకాలంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో మెగా పారిశుద్ధ్య చర్యలు 

వికారాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ఆదివారం మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో మెగా శ్రమదానం కొనసాగిందని ఎంపీఓ నాగరాజు తెలిపారు. గ్రామాల్లో ఇండ్ల మధ్య ఉన్న పిచ్చిమొక్కల తొలిగింపు, కాలువల్లో మురుగును తీసివేయడం, ప్లాస్టిక్‌ను తొలిగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రధాన వీధుల నుంచి తిరుగుతూ ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వివరించారు. గ్రామాల్లోని యువజన సంఘాలు, మహిళా సంఘాలను ఏకంచేసి ఉదయం 8 నుంచి 11గంటల వరకు పనులు చేయించారు. ఈ ప్రక్రియ ప్రతిరోజూ కొనసాగాలని నాగరాజు గ్రామస్తులకు వివరించారు. స్వయంగా నారాయణ్‌పూర్‌లో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శలు ఉన్నారు.

ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు కొనసాగాలి 

మోమిన్‌పేట: గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయా గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులను సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యం లో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి దినం పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, మురుగు కాలువల్లో పేరుకుపోయిన మురుగు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తడి, పొడిచెత్త వేరుచేసి డంపింగ్‌యార్డుకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, వార్డు మెంబర్లు ఉన్నారు.

పరిశుభ్రతతోనే వ్యాధులను అరికట్టవచ్చు

డెంగీ తదితర వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాల పాటు ‘పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో పూలకుండీలను శుభ్రం చేశారు. ఇంటి పరిసరాల్లో చెత్తను తొలిగించి యాంటీ లార్వా మం దులు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ప్రజలందరూ వారి ఆరోగ్యం పట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలు సైతం తమ ఇండ్లలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీరు, ఇంటి పరసరాలల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసుకోవాలన్నారు.