బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jun 06, 2020 , 23:26:25

పంటల సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం

పంటల సాగు వివరాలు  ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం

  • రంగారెడ్డి జిల్లాలో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి
  • నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలి
  • నియోజకవర్గానికి ఒక రైతు వేదిక నిర్మాణం
  • నగరానికి కూరగాయలు, పాలు అందిస్తున్న ఘనత రంగారెడ్డి జిల్లాదే..
  • చేవెళ్లలో నియంత్రిత సాగు విధానంపై  అవగాహన సదస్సు.., రైతుబజార్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి
  • పాల్గొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, రైతులు

షాబాద్‌, నమస్తే తెలంగాణ/చేవెళ్ల : ప్రపంచంలోనే తెలంగాణ వ్యవసాయాన్ని మేటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి నియంత్రిత విధానంలో పంటల సాగుపై రైతుల అవగాహన సదస్సుకు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వానకాలంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. రైతుకు ఎంత భూమి ఉంది, అందులో ఏఏ పంటలు వేస్తున్నారనే విషయాలు మొత్తం వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గర ఉంటాయన్నారు. ఏడాదిలో రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించి ఏ పొలంలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు.

ప్రస్తుతం మక్కజొన్న పంట వేయకూడదని, పత్తి, కంది, జొన్నతో పాటు కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రైతుబంధు సమితులు భారీ విప్లవాన్ని తీసుకువస్తాయని, రైతు విత్తనం నాటినప్పటినుంచి పంట చేతికొచ్చేవరకు వారిదే పూర్తి బాధ్యత ఉంటుందని తెలిపారు. వానకాలంలో రైతులు వేసిన పంటల వివరాల ఆధారంగా యాసంగి ప్రణాళిక తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు ముఖ్యమంత్రి తీపికబురు చెబుతారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డిలో కంది అత్యధికంగా పండిస్తుండడంతో త్వరలోనే ఇక్కడ కంది పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ చర్యలు చేపట్టిందన్నారు.    

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతుల పక్షపాతిగా అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరానికి నిత్యం కూరగాయలు, పాలు అందిస్తున్న ఘనత రంగారెడ్డి జిల్లాకే దక్కుతుందన్నారు. 20 ఎకరాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున రైతు వేదికలు ఏర్పాటు చేసి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతును లక్షాధికారి చేయాలన్నదే ముఖ్యమంత్రి కోరికన్నారు.  ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు.    

ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. భావితరాలకు ఉపయోగపడేలా తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని రైతులు పూర్తిగా కూరగాయలు, పాలు, పండ్లపై ఆధారపడి జీవనం సాగిస్తారని, నగరంలోని ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా కూరగాయలు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, డీసీఓ జనార్దన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఆర్డీఓ తిరుపతిరావు, ఏడీఏ రమాదేవి, ఎంపీడీఓ హరీశ్‌కుమార్‌, ఎంపీపీలు విజయలక్ష్మి, ప్రశాంతి, జడ్పీటీసీ మాలతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్లు అరుణ, నక్క శ్రీనివాస్‌గౌడ్‌, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఏఓలు రాగమ్మ, వెంకటేశం, కృష్ణమోహన్‌, కృష్ణవేణి, పీఏసీఎస్‌ చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, చల్లా శేఖర్‌రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ శైలజ, ఎంపీటీసీ వసంతం, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్లు రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, సీనియర్‌ నాయకులు రాజేందర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రభాకర్‌, వెంకటయ్య, ప్రతాప్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌ ఉన్నారు. 

రైతు బజార్‌ ఏర్పాటుతో రైతులకు మేలు

చేవెళ్ల : రైతు బజార్‌ ఏర్పాటుతో రైతులు పండించిన కూరగాయలను నేరుగా రైతు బజార్‌లో వినియోగదారులకు అమ్ముకొని లాభాన్ని అర్జించుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్లలో నూతనంగా రూ.95లక్షలతో ఏర్పాటు చేసిన రైతు బజారు,  చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్డు పనులను మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పండించిన కూరగాయలను రైతులే నేరుగా అమ్ముకొని అభివృద్ధి చెందాలన్నారు. కూరగాయలను మార్కెట్‌లో అమ్మేందుకు తీసుకువెళ్లి దళారుల చేతుల్లో మోసపోతున్నారని.. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రంగారెడ్డి జిల్లాకు సాగునీరు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, రైతు బంధు సమితి చేవెళ్ల మండల అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, మాజీ ఎంపీపీ బాల్‌ రాజ్‌, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ నర్సింహులు, మండల మాజీ అధ్యక్షుడు రమేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ యూత్‌ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు వసంతం, రాములు, నాయకులు ప్రభాకర్‌, నర్సింహులు, నారాయణ, శ్రీశైలం ఉన్నారు.