సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jun 06, 2020 , 00:36:37

‘మహా’ వెంచర్లకు మార్గం సుగమం

‘మహా’ వెంచర్లకు మార్గం సుగమం

  • 60: 40 శాతం చొప్పున భూ సమీకరణ పథకం
  • యజమానులకు పూర్తిస్థాయి భద్రత,   ఎక్కువ ప్రయోజనం
  • భూములు ఇచ్చే వారికి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా అన్ని అనుమతులు
  • పలు చార్జీల నుంచి మినహాయింపు లు
  • నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొస్తూ సర్కార్‌ ఉత్తర్వులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ పథకం అతి త్వరలోనే కొన్ని చోట్ల కార్యరూపం దాల్చనున్నది. ఈ మేరకు భూ సమీకరణ పథకం (ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీం)కు ఊతం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ల్యాండ్‌ ఫూలింగ్‌ ప్రాజెక్టుయాక్టివిటీ కింద ఉన్న నిబంధనల్లో సర్కారు ఈ  కీలక మార్కులను తీసుకువచ్చింది. భూమి యాజమానుల నుంచి ల్యాండ్‌ ఫూలింగ్‌ ప్రక్రియ కింద ఇప్పటి వరకు ఆమలులో ఉన్న 50 : 50 (ఫిప్టీ-ఫిప్టీ) శాతాన్ని 60 : 40 శాతంగా ఖరారు చేసింది. ఇందులో భూ యాజమానులకు 60 శాతం, హెచ్‌ఎండీఏకు 40 శాతం చొప్పున ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు (జీవోనెం.83) జారీ చేశారు. హెచ్‌ఎండీఏకు ఈ స్కీంకు భూములు ఇచ్చేందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరనున్నది. ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీం కోసం భూములు ఇచ్చే వారికి ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ హెచ్‌ఎండీఏ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ‘నాలా’ ఛార్జీలతో పాటు ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌ ఛార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీంకు భూములు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ ఖర్చులను సైతం హెచ్‌ఎండీఏ భరిస్తుంది. హెచ్‌ఎండీఏ లే ఔట్‌  డ్రాప్ట్‌ అఫ్రూవల్‌ అయిన నాటి నుంచి ఆరు నెలల లోపు ల్యాండ్‌ ఓనర్స్‌కు ప్లాట్లు కేటాయిస్తారు. భూ యాజమానులకు కేటాయించిన ప్లాట్లు వారి ఇష్టానుసారంగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. 

500 ఎకరాల్లో ల్యాండ్‌ఫూలింగ్‌ స్కీం 

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ల్యాండ్‌ ఫూలింగ్‌ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. తక్షణమే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి తీసుకు వచ్చే క్రమంలో మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు మరింత వెసులుబాటు కలిగించే విధంగా విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప సింగారం, కొర్రెముల గ్రామాలతో పాటు శంకర్‌పల్లి మండలంలోని మోకిల,  యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కారం గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామం, ఘట్కేసర్‌ మండలం భోగారం గ్రామంలో ఈ పథకం చేపట్టేందుకు రైతులతో హెచ్‌ఎండీఏ అధికారులు చర్చలు జరిపారు. ఆసక్తి గల భూ యాజమానుల నుంచి సంబంధిత స్థలంలో హెచ్‌ఎండీఏ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్‌ చేయనున్నారు. ఆయా వెంచర్లలో ప్రణాళికబద్ధంగా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. స్థానికంగా భూములకు నిర్ధిష్టమైన ధరలు, అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా, స్థిరాస్తుల పెట్టుబడులు శాశ్వత ప్రాతిపదికన భద్రత దక్కనుంది.