శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Jun 05, 2020 , 23:57:59

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం

  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు అమలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయిన చిన్న, మధ్య తర హా పరిశ్రమలకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో అత్యవసర జిల్లా స్థాయి కన్సల్టేటివ్‌ కమిటీ, డీఎల్‌ఆర్‌ఎస్‌ల సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, సంబంధిత అధికారులు, బ్యాం కర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ కింద అత్యవసర రుణహామీలో భాగంగా అర్హత కలిగిన చిరు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇప్పటికే ఉన్న తనఖా ఆస్తుల హామీతో 20శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. ఏ విధమైన కోలాటరల్‌ సెక్యూరిటీ లేకుండా 7.5శాతం నుంచి 9.5శాతం వడ్డీ వర్తిస్తూ, నాలుగేండ్ల వరకు తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం చెల్లింపుపై పూర్తి మారటోరియాన్ని విధించే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా చిరు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సమూహాలకు సూచించారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ, నాన్‌ ఏఎస్‌ఎంఈలకు రూ.389కోట్లను ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 14257 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 373కోట్ల రుణ సదుపాయం అందించాలనే లక్ష్యాన్ని విధించామన్నారు. దీనిలో భాగంగా మే నెలాఖరుకే లక్ష్యాన్ని మించి రుణ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. జిల్లాలో 83,183మంది రైతులు పీఎం కిసాన్‌ బెనిఫిట్‌ పథకం లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. దీనితో పాటు జిల్లాలో ఉన్న 1,46,540మంది రైతులకు రైతు రుణమాఫీని వర్తింపజేశామని, ఆధార్‌ నంబర్లు సరిగ్గా లేనందున కొంతమందికి రుణమాఫీ జరుగలేదన్నారు. జిల్లాలో మత్స్యకారులు 5600మంది వృత్తిపై ఆధారపడి ఉన్నారని, వీరికి పలు పథకాల కింద బ్యాంకు రుణాలను అందజేస్తున్నట్లు వివరించారు. పాడి పరిశ్రమపై ఆధారపడే రైతులకు కూడా ప్రత్యేక రుణ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 15మున్సిపాలిటీల్లో సర్వే నిర్వహించి, 3294 వీధి వ్యాపారులను గుర్తించి వారిలో 1668 మందికి గుర్తింపు కార్డులు అందజేశామని తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10వేల బ్యాంకు రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు.