బుధవారం 15 జూలై 2020
Rangareddy - Jun 04, 2020 , 23:53:23

రంగారెడ్డి జిల్లాలో 6,777 ఇండ్లు మంజూరు

రంగారెడ్డి జిల్లాలో 6,777 ఇండ్లు మంజూరు

  • రూ.40 కోట్లు విడుదల
  • త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు  పూర్తి చేసేందుకు కసరత్తు 
  • కందుకూరులో 4 ఎకరాల భూదాన్‌ భూమి కేటాయించేందుకు ఏర్పాట్లు 
  • ఇండ్ల కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తులు 

పేదల సొంతింటి కల త్వరలో సాకా రం కానున్నది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల పనులు జోరుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో 22 చోట్ల ఇండ్లు నిర్మించనున్నారు.  ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 6,777 డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 6,383 గృహాల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. 3,300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మరి కొద్ది రోజుల్లో 200లకు పైగా  ఇండ్లు పూర్తి కానున్నాయి.  కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం ఆగకూడదనే ఉద్దేశంతో పేదల ఇండ్ల కోసం సీఎం కేసీఆర్‌ రూ.40 కోట్లు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

- రంగారెడ్డి,నమస్తే తెలంగాణ

నిరుపేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తున్నది. వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 22 చోట్ల నిర్మాణాలు జరుగుతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ.40కోట్లు నిధులు విడుదల చేసింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పని జరిగిన కాలానికి నిధులు వచ్చా యి. ఆన్‌లైన్‌ పాస్‌ ఆర్డర్‌ సబ్మిట్‌ చేసిన అన్ని పనులకు నిధులు మంజూరయ్యాయి. కష్టకాలంలో.. కరోనాతో ఇబ్బందులు పడుతున్నా సంక్షేమం ఆగొద్దన్న సంకల్పం తో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో హర్షం వ్యక్తమవుతున్నది. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.జీహెచ్‌ఎంసీ పరిధిలో జీ+3కి రూ.7లక్షలు, జీ+సీ+ఎస్‌+9 రూ. 7.90 లక్షల చొప్పున వెచ్చించి సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న ది. జిల్లాలో ఆరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,777డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా వీటిలో 6,383 గృహాల నిర్మాణాలకు టెండర్లు పిలువగా 3,300 ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. మరికొద్ది రోజు ల్లో 200 ఇండ్లకు పైగా నిర్మాణాలు పూర్తి కానున్నాయి. 

ఆయా ప్రాంతాలకు రూ.40కోట్లు 

బండరావిర్యాల పరిధిలో నిర్మితమవుతున్న డబుల్‌ బెడ్రూంకు రూ.52.12 లక్షలు, ఫరూఖ్‌నగర్‌ మండలం గుండ్లకుంట, సోలిపురంలలో నిర్మితమవుతున్న మూడు చోట్లకు కలిపి రూ.1.08 కోట్లు, శంషాబాద్‌, దూసకల్‌, తిమ్మాపూర్‌, కిస్మత్‌పూర్‌, మీర్‌పేట, లింగంపల్లి తదితర ప్రాంతాలో నిర్మిస్తున్న వాటికి సంబంధించి రూ.34.61 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని 22 చోట్ల నిర్మాణాలు జరుగుతున్న వాటికి ప్రభుత్వం కష్ట కాలంలో నిధులు ఇచ్చింది.  అక్కడక్కడ చిన్నచిన్న సమస్యలున్నప్పటికీ అధికారులు వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

6,777 ఇండ్లు మంజూరు..

జిల్లాలో 6,777 ఇండ్లు మంజూరు చేయగా, వీటిలో అడ్మిన్‌ మంజూరైనవి 6645 కాగా.. 6383 టెండర్లు పిలిచారు. 3300 ఇండ్ల టెండర్లు పూర్తయ్యాయి. వీటిలో 2,467 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 2లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి పెద్దఎత్తున బడ్జెట్‌లో నిధులను ప్రకటించింది. దీంతో ఇప్పటికే మంజూరైన ఇండ్ల నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకోనుంది. 

246.88 ఎకరాల్లో..6,645 ఇండ్ల నిర్మాణం...

2015-16, 2016-17 వార్షిక సంవత్సరాల్లో జిల్లాలో 6,777 డబుల్‌ బెడ్రూంలు కేటాయించారు. స్థానిక శాసన సభ్యులు, మంత్రుల కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్‌ 6,645 ఇండ్లను నిర్మించేందుకు ఆదేశించారు. ఈ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం 246.88 ఎకరాల భూమిని సేకరించింది. 6,645 ఇండ్ల మంజూరులో చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 1,798 ఇండ్లను జిల్లా పంచాయతీరాజ్‌కు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 4,979 ఇండ్లను జిల్లా ఆర్‌&బీ శాఖకు అప్పగించారు. జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణం G+3 నిర్మాణ క్రమం C+S+9 నిర్మాణం క్రమంతో జీహెచ్‌ఎంసీ అధికారులు 2బీహెచ్‌కే ఇండ్లు నిర్మిస్తున్నారు. 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ( పీఎంఏవై )

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ పథకంలోని యూనిట్‌ విలువ రూ.1.20లక్షలు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పట్టణ పథకంలోని యూనిట్‌ విలువ రూ.1.50 లక్షల వాటాను రెండు పడకల యూనిట్‌కు అనుసంధానం చేశారు. 

2లక్షలకుపైగా డబుల్‌ దరఖాస్తులు 

జిల్లాలోని 27 మండలాల నుంచి రెండు పడకల మంజూరు కోసం ఇప్పటి వరకు 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేసుకుని డబుల్‌ బెడ్‌ రూం కోసం ఎదురుచూస్తున్నారు.


logo