ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 04, 2020 , 01:46:33

జానమ్మ చెరువు సుందరీకరణ

జానమ్మ చెరువు సుందరీకరణ

  • మూడు నెలల్లో డంపింగ్‌యార్డు  పనులు పూర్తి చేయాలి 
  • మున్సిపల్‌ ఇంజినీర్ల పనితీరుపై ఆగ్రహం  
  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌టౌన్‌ : హరితహారం పథకంలో భాగంగా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో ని జానమ్మ చెరువుకు రూ.15లక్షల నిధులతో సుందరీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని  కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మ న్‌ ఎంఎస్‌ నటరాజ్‌, కమిషనర్‌ లావణ్యతో కలిసి పరిశీలించారు. జానమ్మ చెరువు, డంపింగ్‌యార్డు స్థలాన్ని పరిశీలించి మా ట్లాడారు. హరితహారంలో భా గంగా జానమ్మ చెరువులోని మురికి చెట్లను తొలిగించి సుందరీకరణ పనులు చేస్తామన్నారు. చెరువు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రూ.10లక్షలతో పార్కు ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న డంపింగ్‌యార్డు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. డంపింగ్‌యార్డు ఏర్పాటుకు టెండర్లు వెంటనే వేసి మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  9వ వార్డు హాజిపల్లి రోడ్డులోని మురుగుకాల్వ సమస్య గురించి స్థానిక కౌన్సిలర్‌ ప్రతాప్‌రెడ్డి,  5వ వార్డు సోలీపూర్‌ గ్రామ సమీపంలోని బైపాస్‌ సర్వీస్‌రోడ్డులో మురుగునీరు సమస్య గురించి కౌన్సిలర్‌ కృష్ణవేణి  కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. మురుగు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శ్రావణి, నాయకులు గడ్డం సత్యనారాయణయాదవ్‌, జమృత్‌ఖాన్‌, శేఖర్‌ పాల్గొన్నారు.    

ఇంజినీర్ల పనితీరుపై ఆగ్రహం.. 

మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారుల పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. డంపింగ్‌యార్డు నిర్మాణ పనులకు టెండర్లను ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డంపింగ్‌యార్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

 సోలీపూర్‌  చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్యకు సూ చించారు. మున్సిపాలిటీలో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. కౌన్సిలర్లు, గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.