బుధవారం 08 జూలై 2020
Rangareddy - Jun 02, 2020 , 23:41:33

స్వయం సహాయక బృందాలకు రూ. 20.50 కోట్ల చెక్కు అందజేత

స్వయం సహాయక బృందాలకు  రూ. 20.50 కోట్ల చెక్కు అందజేత

  • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత 
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రత్యేక తెలంగాణ సాధనతోనే రాష్ట్ర రైతు నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాడని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అడినల్‌ కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎఫ్‌సీఐ ద్వారా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో 56 లక్షల మెట్రిక్‌ టన్నులు తెలంగాణ రైతుల నుంచి సేకరించినవేనని అన్నా రు. ఈ ఘనత సాధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో గుర్తించవచ్చన్నారు. పదేండ్లకు పైగా పట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని కేవలం మూడేండ్లలోనే నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రం గారెడ్డి జిల్లాకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా త్వరలోనే పూర్తవుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 

అభివృద్ధి, సంక్షేమ రం గాల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని గుర్తుచేశారు. రెప్పపాటు కూడా విద్యుత్‌ పో కుండా 24 గంటలపాటు కరెంట్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత సమన్వయంతో పనిచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.  నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో.. స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో... ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఈ ఆరేండ్లు చేసిన అవిరామ కృషి, అలుపులేని దీక్ష, అనుక్షణం జరిపిన మేథోమథన ఫలితంగా నేడు మన కళ్లముం దు ప్రత్యక్షంగా కనపడుతున్నదన్నారు. రాష్ట్రంలో సమైక్య పాలనలో గడిచిన 60 ఏండ్లలో జరుగని ప్రగ తి సీఎం కేసీఆర్‌ సమర్థపాలనలో గత ఆరేండ్లలోనే జరిగి.. నేడు లక్ష కోట్ల పసిడి పంటలు పండించుకునే పచ్చ ని పచ్చలహారంగా తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు.

మన నిధులు మన అవసరాలకు, మన ఆత్మగౌరవానికి, మన సంక్షేమానికి, మన ప్రగతికి ఖర్చు చేస్తూ, నేడు దేశంలోనే అత్యద్భుత గ్రోత్‌ రేట్‌ను నమోదు చేస్తూ, దేశానికి పథకాల్లో, ప్రాజెక్టుల్లో దిశానిర్దేశం చేస్తూ, నిధుల తెలంగాణగా, నిలబడిన తెలంగాణగా, నిలిచి గెలిచిన తెలంగాణగా మన రాష్ట్రం అవతరించిందని పేర్కొన్నారు. వ్యవసాయమంటే దండుగ కాదని.. 24 గంటల ఉచిత విద్యుత్‌, ప్రా జెక్టుల రీడిజైనింగ్‌, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీలతో, పుష్కలంగా విత్తనాలు, ఎరువుల పంపిణీతో వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతును రాజును చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే అన్నారు. ఏడేండ్ల రాష్ట్ర ఆవిర్భావ సంబురంలోకి ఎంతో సంతోషంతో అడుగు పెడుతున్న ఈ సందర్భం మరపురానిది, మనందరికీ పం డుగన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడి కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో ఎక్కడా చేయని విధంగా సీఎం కేసీఆర్‌ వలస కార్మికులను ఆదుకున్న గొప్ప నేత అని వెల్లడించారు.   

ఈ సందర్భంగా జిల్లాలోని స్వయం సహాయక బృందాలకు రూ.20.50 కోట్ల చెక్కును మంత్రి అందజేశారు. కాగా, జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణకు వచ్చి న మంత్రికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు ఘన స్వగతం పలికారు. పతాకావిష్కరణ అనంతరం తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. నేడు ఉదయం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలోగల అమరవీరుల స్మారక చిహ్నానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బంగారు తెలంగాణ పునాది పడిన రోజు 

బంగారు తెలంగాణ పునాది పడిన రోజు .. స్వప్నం సాకారమైన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయం పై జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర ఆవతరణ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు స్వపరిపాలనలో, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటున్న వేళగా అభివర్ణించారు.  

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంపై..

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంపై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏవో మీర్‌సిరాజ్‌ ఆలీ, ఎంసీహెచ్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌, ఎస్‌ఓ వేణు, డీఎంఈవో శ్రీనివాస్‌లు, జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షుడు లక్ష్మణ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

బీజేపీ ఆధ్వర్యంలో..

   అమరవీరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్రం సాధించుకున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండా ఎగురరేసి అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో మంది విద్యార్థుల బలిదానం ఫలితంగానే ఈ రోజూ తెలంగాణ సాధించుకున్నామన్నారు.

సీపీఐ కార్యాలయంపై..

  సీపీఐ జిల్లా కార్యాలయంపై జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య జెండా ఎగురవేశారు. రాజేంద్రనగర్‌లోని ఏఆర్‌ దేవరాజ్‌ భవన్‌లో రాష్ట్ర ఆవతరణ దినోత్సవం నిర్వహించారు.


logo