బుధవారం 08 జూలై 2020
Rangareddy - Jun 02, 2020 , 23:41:27

పరిశుభ్రతతోనే వ్యాధులుదూరం

పరిశుభ్రతతోనే వ్యాధులుదూరం

  • రెండో రోజూ జోరుగా శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు 
  • రెండో రోజుకు చేరిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
  • వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో  ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం
  •  కాలువల్లో పూడికతీత,  పిచ్చి మొక్కల తొలగింపు

కడ్తాల్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. కడ్తాల్‌ పట్టణంలో 2వ వార్డులో ఎమ్మెల్సీ స్థానిక నాయకులతో కలిసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ అనురాధ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

టీఎస్‌ బీపాస్‌ ద్వారా అనుమతులు

  • - కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి

కొడంగల్‌ : వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్‌ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు గాను కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుక అనంతరం కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో కౌన్సిలర్లు పరిసరాల పరిశుభ్రతలు చేపట్టాలని తెలిపారు. కౌన్సిలర్లందరూ వారం రోజుల పాటు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. అదేవిధంగా గృహ, లే అవుట్ల అనుమతులు పొందేందుకు ప్రభుత్వం సులభతరంగా టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటును కల్పించిందన్నారు. ఆన్‌లైన్‌లో అనుమతులకు దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పించాలన్నారు.  బుధవారం మున్సిపల్‌కు సంబంధించి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు కలెక్టర్‌ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో సమావేశాలు నిర్వహించే ఆస్కారం లేనందున టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బడ్జెట్‌ సమావేశాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఉషారాణితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

సీజనల్‌ వ్యాధులకు దూరంగా ఉండాలి

  • - వికారాబాద్‌ మున్సినల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌ టౌన్‌ : వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులకు పట్టణవాసులు దూరంగా ఉండేందుకు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు. మంగళవారం పట్టణంలో 26, 30వ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కాలనీ వాసులందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నీటి నిల్వను వెంటనే తొలిగించాలని ప్రజలకు సూచించారు. కాలనీల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటికే ప్రతి కాలనీ సమస్యలు తీర్చమని, ఇంకా ఏ కాలనీలోనైనా సమస్యలు ఉంటే తమకు తెలుపాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

వికారాబాద్‌ రూరల్‌ : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని అన్నారు. మంగళవారం మండలమలోని మైలార్‌దేవరంపల్లిలో వారు పర్యటించారు. గ్రామంలోని మురుగు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి సమస్య ఉండకుండా చూడాలన్నారు. కొత్త కొత్త రోగాలు వర్షాకాలంలోనే  వస్తుంటాయని వాటిని ముందుగానే గుర్తించి నివారించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిణి, ఎంపీవో నాగరాజు, సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. 

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

  • -శంకర్‌పల్లి ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి

శంకర్‌పల్లి రూరల్‌ : గ్రామాల్లో సర్పంచ్‌లు పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శంకర్‌పల్లి ఎంపీపీ ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  గోపులారం, కొత్తపల్లి, అంతప్పగూడ, జనవాడ, మహారాజ్‌పేట్‌, ఎల్వర్తి గ్రామాలను ఎంపీడీవో సత్యయ్యతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీనివాస్‌, నర్సింహారెడ్డి, శాంతచెన్నయ్య, సత్యనారాయణ, అశ్వినిసుధాకర్‌ పాల్గొన్నారు.

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి 

మోమిన్‌పేట్‌ : పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో శైలజారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని కొల్కుంద, చిన్న కొల్కుంద గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను, వన నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని మురుగు కాలువలను, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా గుంతలు ఉంటే మురుగు నీరు నిల్వ ఉండకుండా గుంతల్లో మట్టిపోసి దోమల నివారణ మందును స్ప్రే చేయాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను ఈ నెల చివరి వరకూ నాటడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. నాటిన మొక్కల చుట్టూ ట్రీగార్డ్స్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సురేశ్‌, పార్వతమ్మ, ఏపీవో శంకర్‌, కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉప్పరిగూడలో..

ఆదిబట్ల : ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి సౌజన్యంతో గ్రామ పంచాయతీల్లో ఉచిత సేవలు అందించే హైపో క్లోరైడ్‌ స్ప్రే యంత్రాన్ని ఎంపీపీ కృపేశ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో రసాయన మందులను పిచికారీ చేసేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, సత్తు వెంకటరమణారెడ్డి, సొసైటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, నందారెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

దోమ : తడి, పొడి చెత్తను వేరు చేయాలని సర్పంచ్‌ కృష్ణ అన్నారు. దాదాపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి తారకరామారావు, పరిగి శాసనసభ్యుడు మహేశ్‌రెడ్డి సూచనల మేరకు చెత్త బుట్టలను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మహిళలు  పాల్గొన్నారు.

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

షాద్‌నగర్‌రూరల్‌: వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ సీజనల్‌ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, మండల ప్రత్యేక అధికారి ఓం ప్రకాశ్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని దూసకల్‌, బుచ్చిగూడ గ్రామాల్లో మంగళవారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్‌లు సులోచనమ్మ, మురళీధర్‌రెడ్డి, దూసకల్‌ ఎంపీటీసీ యాదయ్య పంచాయతీ కార్యదర్శులు కల్యాణి, శ్రీలత, ఆరాధన పాల్గొన్నారు.


logo