శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - May 31, 2020 , 23:42:22

వేసవి నుంచి ప్రజలకు ఉపశమనం

 వేసవి నుంచి ప్రజలకు ఉపశమనం

  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోభారీ వర్షం
  • హయత్‌నగర్‌లో 6.6 సె.మీ. నమోదు
  • కమ్మగూడలో తెగిన విద్యుత్‌ వైర్లు, విరిగిన స్తంభాలు, కూలినచెట్లు 
  • నందిగామ, కడ్తాల్‌,  శంకర్‌పల్లి,కొత్తూరులో ఉరుములు, మెరుపులు
  • యాచారంలో ఈదురుగాలుల వాన
  • జలమయమైన రోడ్లు,  పొంగిపొర్లిన మురుగు కాల్వలు

భానుడి భగభగలతో అతలాకుతలమైన ప్రజలకు ఆదివారం కురిసిన భారీ వర్షం ఉపశమనం ఇచ్చింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో భారీ వర్షానికి విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. సాగర రహదారిపై చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. కమ్మగూడ ఏపీఏటీ కాలనీలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలింది. ఓ ఇంటి రేకులు ఎగిరిపోయి విద్యుత్‌ వైర్లపై పడడంతో వైర్లు తెగి, స్తంభం విరిగిపోయింది. యాచారం, నందిగామ, కడ్తాల్‌, కొత్తూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. షాద్‌నగర్‌లో మోస్తరు వర్షం కురిసింది. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : భానుడి భగభగలతో అతలాకుతలమైన ప్రజలకు ఆదివారం కురిసిన వర్షం ఉపశమనాన్నిచ్చింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమ య్యాయి. నందిగామ, ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం మండలాల్లో వర్షం పడడంతో ప్రధాన రహదారులతో పాటు కాలనీలు జలమయం అయ్యాయి. గాలివానతో వర్షం పడటంతో కడ్తాల్‌ మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వాహనదారులు సైతం లైట్లు వేసుకోని ప్రయాణాలు కొనసాగించారు. నెల రోజులుగా ఎండలకు తట్టుకోలేకపోయిన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం కలిగింది. అనుకున్న సమయాన్ని కంటే ముందే వర్షాలు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తుర్కయాంజాల్‌లో..

హయత్‌నగర్‌ : తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం గాలివానకు విద్యుత్‌స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కమ్మగూడ ఏపీఏటీ కాలనీలో భారీ వృక్షం నేలకూలింది. 22వ వార్డులో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన రేకులు ఒక్కసారిగా ఎగిరి విద్యుత్‌ తీగలపై పడగా.. విద్యుత్‌ స్తంభం విరిగిపోయింది. అప్పటికే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మున్సిపల్‌ సిబ్బంది స్థానికుల సహాయంలో విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించారు.

కొత్తూరు : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. కొత్తూరు మండలంలోని పెంజర్ల, కొడిచర్ల, సిద్దాపూర్‌, జేపీ దర్గా, ఇన్ముల్‌నర్వ. కొత్తూరు, కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో భారీగా వర్షం కురిసింది. వానకాలం దృష్ట్యా రైతులు పొలాలకు దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధంగా ఉంచారు. సుమారు వారంరోజులుగా మండలంలో ఎండలు మండిపోయాయి. ఎండలకు తీవ్ర ఇబ్బందులకు గురైన మండల ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో హర్షం వ్యక్తం చేశారు.

శంకర్‌పల్లి :  శంకర్‌పల్లిలో మధ్యాహ్నం 3గంటల ప్రాం తంలో వర్షం భారీగా కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

షాద్‌నగర్‌లో.. 

షాద్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. పట్టణంతో పాటు మండలంలోని కమ్మదనం, నాగులపల్లి, హాజపల్లి, లింగారెడ్డిగూడ, వివిధ గ్రామాల్లో వర్షం కురిసింది. రోహిణి కార్తె కావడంతో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. మున్ముందు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తమ పంటను వేసుకునేందుకు అన్నివిధాలా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మోస్తారు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.