మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - May 27, 2020 , 22:48:23

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

  • చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భార్యాభర్తలు
  • నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకరు 
  • దోమ పీఎస్‌ పరిధిలో మరొకరు 

పూడూరు: ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి శీనుసాగర్‌ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు రావడానికి  ఆనంద్‌ (35), ఉష (32) దంపతులు  ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. సోమన్‌గుర్తి స్టేజీ సమీపంలో గ్రామానికి వెళ్లే దారి వివరాలను ఓ వ్యక్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ - బీజాపూర్‌ హైవే రోడ్డు పై నుంచి  గ్రామానికి వెళ్లేందుకు బైక్‌ను మలుపుతుండగా, మన్నెగూడ నుంచి పరిగి వైపు వెళ్లే కారు వెనుకాల నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఆనంద్‌, ఉష  హైవే రోడ్డుపై పడ్డారు. పరిగి నుంచి మన్నెగూడ వైపు వెళ్తున్న కారు వారిపై నుంచి వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆనంద్‌ స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, కొత్తపేట. కాగా హైదరాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేసేవాడు.  వారికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు.  పరిగి వైపు వెళ్తూ మొదట బైక్‌ను ఢీ కొట్టిన కారు  ఘటనా స్థలంలో అపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భీమ్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఢీ కొట్టిన కారు ఆచూకీ తెలిసేంతవరకు పోస్టుమార్టం చేసేదిలేదని బంధువులు దవాఖాన వద్ద ఆందోళన చేశారు.     

నందిగామలో...

నందిగామ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంపాలైన సంఘటన నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. బీహార్‌ రాష్ట్రం చప్రా జిల్లాకు చెందిన రంజిత్‌సింగ్‌ (35) కొన్ని సంవత్సరాలుగా కొత్తూరులో నివాసముంటూ వీర్లపల్లి శివారులోని జాగృత స్టీల్‌ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బైకుపై బుధవారం ఉదయం కొత్తూరు నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్తూ పాతజాతీయ రహదారి నూజివీడు పరిశ్రమ సమీపం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూర్‌ వైపు వెళ్తుతున్న ప్రైవే ట్‌ బస్సు(కేఏ53ఏ5042) అతివేగంగా వెనుక నుంచి వచ్చి బైకును ఢీకొట్టడం తో రంజిత్‌సింగ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సును అదుపులోకి తీసుకుని నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ దవాఖానకు తీసుకెళ్లారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

దోమలో ...

దోమ : ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పి  యువకుడు మృతి చెందిన ఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దొంగఎన్కేపల్లి  సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్కూటీ మీద పరిగికి వెళ్తున్న నర్సయ్యగూడ గ్రామానికి చెం దిన పద్మారం నరేశ్‌కుమార్‌ (25) ప్రమాదవశాత్తు స్కూటీ అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అం దించారు.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  మృతుడి కుటుంబసభ్యుల  ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.