మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - May 27, 2020 , 00:56:58

స్వయం ఉపాధి

స్వయం ఉపాధి

  • మహిళా సంఘాల ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు,  హ్యాండ్‌ వాష్‌లు తయారీ
  • 20లక్షల మాస్కులు సిద్ధం చేసేందుకు  డీఆర్డీఏ కార్యాచరణ
  • సిరిసిల్ల, పోచంపల్లి నుంచి  వస్త్రం దిగుమతి   జిల్లా  వైద్య  ఆరోగ్యశాఖ నుంచి 4లక్షల ఆర్డర్‌  
  • ఇప్పటికే  తయారీలో రాష్ట్రంలో జిల్లాది రెండో స్థానం

కరోనా దెబ్బకు మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ల వినియోగం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. డిమాండ్‌ ఎక్కువ.. సైప్లె తక్కువగా ఉండడంతో స్వయం సహాయక సంఘాలకు రూ.2.50 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేసి వీటిని తయారు చేయించేందుకు డీఆర్డీఏ కసరత్తు చేస్తున్నది. జిల్లాలో 4 క్లస్టర్ల పరిధిలో ఆరు నియోజకవర్గాలకు చెందిన మహిళా సంఘాల నుంచి వీటిని తయారు చేయించనుండగా ఆసక్తి గల సంఘాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు సంఘాల ఆధ్వర్యంలో 6.90లక్షల మాస్కులు తయారు చేసి వివిధ శాఖలకు అందించగా, ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి 4లక్షల మాస్కులకు ఆర్డర్‌ వచ్చింది. వచ్చే నెలలో జరుగనున్న పది పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం 65వేల మాస్కులు సిద్ధం చేసేందుకు 400మంది మహిళలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మాస్కులు అవసరం ఉండగా.. జిల్లా నుంచి 20లక్షల వరకు అందించేలా ప్రణాళికలు రూపొందించారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను.. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాయి. ఒకవైపు వైరస్‌ కట్టడిలో భాగస్వాములు కావడంతోపాటు మరోవైపు జీవనోపాధి పొందుతున్నారు. కరోనావైరస్‌తో కలిసి బతకాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుండటంతో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు కీలకంగా మారుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజా అవసరాలను గుర్తించిన యంత్రాంగం.. వాటిని తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ బాధ్యతలను జిల్లాలోని మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించిన యంత్రాంగం.. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ల తయారీ కోసం మహిళా సంఘాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే జిల్లా మాస్కుల తయారీలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు క్లస్టర్ల పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు 6.90లక్షల మాస్కులు తయారు చేసి వివిధ శాఖలకు అందించింది. జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి 4 లక్షల మాస్కులకు ఆర్డర్‌ వచ్చింది. వచ్చే నెలలో జరుగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి 65 వేల మాస్కుల తయారీకి 400ల మంది మహిళలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మండలంలో యూనిట్‌ నెలకొల్పడానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. 

మాస్కుల తయారీ..

మాస్కుల తయారీ బాధ్యతలను ఫరూఖ్‌నగర్‌, నందిగామ, మహేశ్వరం, శంకర్‌పల్లి మండలాల్లో మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. టైలరింగ్‌లో నైపుణ్యం గల 400 మంది సభ్యులను గుర్తించారు. తిరిగి వినియోగించగలిగే (రీ యూజ్‌) మాస్క్‌ తయారీకి అవసరమైన వస్త్రం, దారం, ఎలాస్టిక్‌ తదితర ముడి సరుకులు కొనుగోలు చేయాల్సి ఉంది. టెస్కో నుంచి వస్ర్తాన్ని తీసుకునే అంశాన్ని యంత్రాంగం పరిశీలిస్తున్నది. ఒక్కో మాస్కు ధరను నాణ్యత, పొడవు, వెడల్పుని బట్టి నిర్ణయిస్తారు. సిరిసిల్ల, పోచంపల్లి నుంచి వస్త్రం చేస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో మాస్కుల తయారీ జరుగుతుండగా.. కేవలం శంకర్‌పల్లి, మహేశ్వరం, నందిగామ, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లో టాప్‌ టెన్‌లో 50వేలకు పైగా మాస్కులు తయారు చేశారు. 

4 లక్షల ఆర్డర్‌

ఇప్పటికే 4లక్షల మాస్కులు కావాలని డీఆర్డీఏకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఖరారైన ధరను బట్టి ఆ మొత్తాన్ని డీఆర్డీఏకు వైద్యశాఖ చెల్లించనుంది. ఈ మాస్కులను ఉపాధి కూలీలు, పింఛన్‌దారులు, నిస్సహాయులకు అందించనున్నారు. నిర్దేశించిన ఒక్కో మండలంలోని సభ్యులు లక్ష చొప్పున మాస్కులు కుట్టాల్సి ఉంటుంది. ఇవిగాక మరో లక్ష మాస్కుల ఆర్డర్‌ కూడా వచ్చింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌, విద్యుత్‌, వ్యవసాయశాఖ, విద్య, వైద్య,ఆరోగ్య శాఖ, కలెక్టరేట్‌ తదితర విభాగాలు తమకు మాస్కులు కావాలని కోరాయి. వీటిని గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులు, ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అందించనున్నారు. 

నాలుగు క్లస్టర్లు..ఆరు నియోజవకవర్గాలు..

జిల్లాలో 4క్లస్టర్ల పరిధిలో ఆరు నియోజకవర్గాలకు చెందిన స్వయం సహాయక సంఘాల నుంచి వీటిని తయారు చేయిస్తున్నారు. మొదటి దశలో శంకర్‌పల్లి, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్‌, నందిగామ మండలాలను ఎంపిక చేశారు. రెండో విడుతలో మంచాల, తలకొండపల్లి, మొయినాబాద్‌, శంషాబాద్‌ మండలాలను ఎంపిక చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.  

మహిళలను చైతన్యపరుస్తున్నాం

జిల్లాలో మహిళలను చైతన్యపరుస్తూ.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వ ర్యంలో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ల తయారీ కోసం మహిళా సంఘాల గుర్తింపు చేస్తున్నాం. ఒక్కో మండలంలో 15 నుంచి 20మంది సభ్యులకు దీని ద్వారా స్వయం ఉపాధి లభిస్తుంది. జిల్లాలో 4 క్లస్టర్ల పరిధిలో ఆరు నియోజకవర్గాలకు చెందిన స్వయం సహాయక సంఘాల నుంచి వీటిని తయారు చేస్తున్నారు. యూనిట్‌ నెలకొల్పేందుకు కూడా ఒక్కో మండలానికి రూ.2.50 లక్షల ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తుంది. మాస్కుల తయారీలో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచాం.

- జంగారెడ్డి, జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌