సోమవారం 25 మే 2020
Rangareddy - May 24, 2020 , 00:32:00

మరో 7గోదాములు

మరో 7గోదాములు

  • ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ గోదాములకు ఒక్కొక్కటి 20 ఎకరాల చొప్పున స్థలం కేటాయింపు 
  • మిగతా చోట్ల 10 ఎకరాలు కేటాయింపు
  • ఇప్పటికే జిల్లాలో 29 గోదాములు..
  • 75,900 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం

(రంగారెడ్డి, నమస్తే తెలంగాణ) : వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గోదాములు నిర్మించేందుకు స్థలాల సేకరణ పూర్తయింది. ఆరుగాలం కష్టించి రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు వీటిలో నిల్వచేసేందుకు వీలుగా గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గోదాం ఉండేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అనువైన స్థలాల కోసం రెవెన్యూ అధికారులు అన్వేషించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఒక్కో గోదాం నిర్మాణం, వాహనాల పార్కింగ్‌, మౌలిక వసతుల కల్పన తదితర వాటికోసం 10 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని స్థల సేకరణ చేశారు. స్థలాల లభ్యతేనే కాకుండా రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. హైవే, నేషనల్‌ హైవే, స్టేట్‌ హైవే రహదారులను పరిశీలించి ఈ స్థలాల సేకరణ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయాలన్నా.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సదుపాయం, ఇలా అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాలో ఏడు చోట్ల స్థలాల సేకరణ చేయడం పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ గోదాములకు మాత్రమే 20 ఎకరాల చొప్పున స్థలం కేటాయించగా.. మిగతా చోట్ల 10 ఎకరాలు కేటాయించారు. 

నూతనంగా ఎందుకంటే..

రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఫలితంగా అదేస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం దిగుబడి కూడా అధికమవుతున్నది. వీటిని నిల్వ చేయడానికి ప్రస్తుతమున్న గిడ్డంగుల సామర్థ్యం సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా నేపథ్యంలో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే సేకరిస్తుండటంతో నిల్వలకు స్థలం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేగాక సీజన్లలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు స్వల్ప సామర్థ్యంలో ఉన్న గిడ్డంగులు అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త గోదామును నిర్మించాలని సర్కార్‌ తలపెట్టింది. జిల్లాలో ఎక్కువ మొత్తంలో ధాన్యం, మొక్కజొన్న, కందులు, ఇతర ఉద్యాన పంటలను రైతులు పండిస్తున్నారు. నూతన గోదాములు అందుబాటులోకి వస్తే రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. 

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 

నియోజకవర్గంలో ఒకటి చొప్పున గోదాం నిర్మిస్తామని ప్రభు త్వం పేర్కొంది. జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, చేవెళ్ల, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉండగా.. ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి పూర్తిగా పట్టణ ప్రాం తాలు. శేరిలింగంపల్లి పూర్తిగా పట్టణ ప్రాంతం కావడం.. ఇక్కడ భూముల ధరలు గణనీయంగా పెరగడంతోపాటు స్థల భావ సమస్య కూడా ఉన్నది. అలాగే కల్వకుర్తి నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది. ఇక్కడ నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రాగా, మరో రెండు మండలాలు నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో జిల్లా అధికారులు ఇక్కడ.. అక్కడ రెండు చోట్ల స్థలాలకు సంబంధించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఈ అంశంపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వనుంది. అలాగే ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో కూడా స్థల భావం, భూముల ధరలు గణనీయంగా ఉండడంతో పొరుగున ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్థలం కేటాయించారు. ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి స్థలం అధికంగా ఉండడంతో ఒక్కొక్క గోదాముకు 20 ఎకరాలు కేటాయించారు. ఇవిపోగా మిగిలిన ఆరు సెగ్మెంట్ల పరిధిలో ఒక్కో గోదాముకు 10 ఎకరాలు కేటాయించారు. ఏడు నియోజకవర్గాల్లో కొత్త గోదాములు అందుబాటులోకి రానున్నాయి.  

29 గోదాములు.. 75,900 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం..

జిల్లాలో ప్రస్తుతం 29 గోదాములు ఉండగా వీటి మొత్తం సామర్థ్యం 75,900 మెట్రిక్‌ టన్నులు. వీటిలో 11 గోదాములు పాతవి. ఒక్కో గోదాం కనీసం 400 మెట్రిక్‌ టన్నుల నుంచి 2వేల మెట్రిక్‌ సామర్థ్యం గలవి. వీటి మొత్తం సామర్థ్యం 13, 400 మెట్రిక్‌ టన్నులు. ఇవిగాక నాబార్డు అందించిన రుణ సహాయంతో 18 గోదాములను మార్కెటింగ్‌ శాఖ నిర్మించింది. ఉత్పత్తుల నిల్వపరంగా ఇవి అధిక సామర్థ్యం గలవి. ఒక్కో గోదాం కనిష్టంగా 2,500 నుంచి 5వేల మెట్రిక్‌ టన్నుల సామ ర్థ్యం ఉన్నవి. వీటి మొత్తం సామర్థ్యం 62,500 మెట్రిక్‌ టన్నులు. ఈ గోదాముల నిర్వహణ బాధ్యతలను ఏడు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలు చూసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ గిడ్డంగులను ప్రభుత్వ రంగ సంస్థలైన సీసీఐ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, పౌర సరఫరాల సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. మూడు నాలుగు చోట్ల గోదాములను ప్రైవేటు సంస్థలకు అద్దెకిచ్చారు. వీటికి కొత్తవి తోడైతే గిడ్డంగుల సామర్థ్యం మరింత పెరుగనుంది.

ఈ సర్వే నంబర్లలో నిర్మాణాలు..

ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల గోదాములు తుర్కయాంజాల్‌లోని సర్వే నం.631లో 40 ఎకరాలు, మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్‌ఐఐసీలోని సర్వే నం.306లో, గంగారంలోని సర్వే నం.85లో, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం లోని శంషాబాద్‌ మండలంలోని జుక్కల్‌ గ్రామంలోని సర్వే నం.187లో, చేవెళ్ల నియోజకవర్గంలో శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి గ్రామంలోని సర్వే నం.197లో, కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లు మండలం చందన్‌పల్లిలో సర్వే నం.23 లో, షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం గూ డూరు గ్రామంలో సర్వే నం.478లో 10 ఎకరాల చొప్పున గోదాముల నిర్మాణాలకు సంబంధించి స్థలాల సేకరణ చేసిన జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. 


logo