మంగళవారం 26 మే 2020
Rangareddy - May 22, 2020 , 22:56:52

పేదలకు సర్కారు వైద్యం

పేదలకు  సర్కారు వైద్యం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి 

సద్వినియోగం చేసుకోవాలి

 ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

ప్రేమ్‌నగర్‌లో ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

బండ్లగూడ/ లింగోజిగూడ/ కొండాపూర్‌: రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ వైద్యం అందించి, వారిని ఆరోగ్యంగా ఉంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని బుద్వేల్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలసి మంత్రి బస్తీ దవాఖానను ప్రారంభించారు. లింగోజిగూడ డివిజన్‌లోని అధికారి నగర్‌, కామేశ్వర్‌ నగర్‌లో బస్తీ దవాఖానను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. కొండాపూర్‌ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానను ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, డివిజన్‌ కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, డీసీ వెంకన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీలో సుమారు 300 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 120 బస్తీ దవాఖానలు ఉన్నాయని, వాటి ద్వారా చాలామంది మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. ఒక్క రోజే నగరంలో 45 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరు పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందించడమే సీఎం లక్ష్యం అన్నారు. బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు చేసి వైద్యం అందిస్తారన్నారు. అవసరమైన వారికి ఇతర దవాఖానలకు రెఫర్‌ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రావుల విజయజంగయ్య, కోరని శ్రీలత మహాత్మ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సృజన, డాక్టర్‌ రాజ్యలక్ష్మి, బస్తీ దవాఖానల డాక్టర్లు, రాజేంద్రనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.  


logo