సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - May 21, 2020 , 23:37:41

ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి

ప్రభుత్వం సూచించిన పంటలనే వేయాలి

రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం సూచించిన విధంగా ఈ వానకాలంలో మక్కజొన్న పంటను సాగుచేయకుండా ప్రభుత్వం సూచించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రంగారెడ్డి జిల్లాపరిషత్‌ చైర్మన్‌ తీగల అనితారెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర లభించడంద్వారా రైతును రాజును చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన మాదిరిగా పంటలను వేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జిల్లాలో రైతులు గతంలో మాదిరిగా కాకుండా సన్న రకాల వరి పంటను సాగు చేయాలని తెలిపారు. ఇందుకుగాను వరి విత్తనాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు. పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సాల నుంచి అతితక్కువ ధరకే మక్కజొన్నలు మార్కెట్లోకి వస్తున్నందున సరైన ధర లభించడం లేదని అన్నారు. జిల్లాలో కంది పంటను అధిక విస్తీర్ణంలో వేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు, ఏజెన్సీ వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నందున రైతులు ముందస్తుగా కొనుగోలు చేయాలని, తద్వారా రద్దీని నివారించాలన్నారు=