గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 21, 2020 , 01:40:14

డిమాండ్‌కు అనుగుణంగా సాగు

డిమాండ్‌కు అనుగుణంగా సాగు

మక్కజొన్న సాగు చేయవద్దు

పత్తి సాగును రెట్టింపు చేయండి

ఆర్గానిక్‌, ఉద్యానవన వ్యవసాయానికి ప్రాధాన్యం

వ్యవసాయాన్ని సంక్షేమ రంగంగామార్చేందుకు నూతన విధానం

మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి, వికారాబాద్‌ కలెక్టరేట్లల్లో సమీక్షలు

రంగారెడ్డి,/వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత పంటల విధానాన్ని ప్రవేశ పెట్టి అమలుచేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. నియంత్రిత పంటల సాగుతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. బుధవారం వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లల్లోని కలెక్టర్‌ చాంబర్లలో పంటల సాగుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత వానకాలంలో రైతులు మక్కజొన్న వేయ్యొద్దని, వాటి స్థానంలో వ్యవసాయ అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. గతేడాది రంగారెడ్డి జిల్లాలో లక్షా ఎనిమిది వేల ఎకరాల్లో మక్క లు పండించారని, దీంతో మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో గతేడాది రెండు లక్షల 18 వేల ఎకరాల్లో పత్తిని పండించగా, ఈసారి దీన్ని 2.60 లక్షలకు పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు. జిల్లాలో గతంలో మాదిరిగా కాకుండా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వరి వంగడాల తో పంట పండించాలని, ఇందుకు వరి విత్తనాలను ప్రభుత్వమే రైతులకు అందిస్తుందని అన్నారు. 18వేల ఎకరాల్లో మాత్రమే కందులు పండిస్తున్నారని, లక్ష ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉన్నందున సాగును మరింతగా పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఏ భూముల్లో ఏ పంటలు వేయాలో, విత్తనాలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్‌ సదుపాయం తదితర అంశాలపై రైతులను చైతన్య పర్చాలని మంత్రి సబితా రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణానికి స్థలాల సేకరణను యుద్ధప్రాతిపదిక న చేపట్టి  వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని కోరా రు. రెం డేండ్లల్లో అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశానికి పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి, పి. రాములు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ హరీశ్‌, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వికారాబాద్‌లో..

వికారాబాద్‌లో మంత్రి మాట్లాడుతూ ఈ వానకాలం సీజన్‌లో మక్కజొన్నకు బదులుగా పత్తి పంటను రెట్టింపు స్థాయిలో సాగు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని రైతాంగానికి సూచించారు. ఏ భూమిలో ఏ పంట వేస్తే అధి క దిగుబడి, అధిక లాభాలు వస్తాయో ఆ మేరకు క్లస్టర్ల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో 2018-19లో కేవలం 1,11,197ఎకరాలు గల పత్తిసాగు గతేడాది అమాంతం 1,93,811 వేల ఎకరాలకు పెరిగిందన్నారు. ఈ సీజన్‌లో 2.52 లక్షలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మక్కకు బదులుగా పప్పు ధాన్యాలను సాగు చేయాలని సూచించారు. ఈసా రి కంది సాగు 1,73,900 ఎకరాలు, పెసర 20, 800ఎకరాలు, మినుములు 9500ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్గానిక్‌, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

రాష్ట్రంలో పండించే పంటలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్‌ ఉందని, ప్రభుత్వ ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దీంతో మన పంటలు విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.350కోట్ల నిధులు కేటాయించిందని, జిల్లాలో 99వేదికలు నిర్మించనున్నామని వెల్లడించా రు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో  కలెక్టర్‌ పౌసుమీ బసు, పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య పాల్గొన్నారు.