సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - May 15, 2020 , 00:33:39

స్పీడ్‌కు బ్రేక్‌..!

స్పీడ్‌కు బ్రేక్‌..!

  • వాహనాల వేగానికి స్పీడ్‌ గన్‌తో కళ్లెం
  • రహదారులపై సత్ఫలితాస్తున్నపోలీస్‌ శాఖ చర్యలు
  • నూతన విధానాలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు 
  • భారీగా జరిమానాల విధింపు 
  • వాహనదారులపై13వేల చలాన్లు, ప్రభుత్వానికి రూ.కోటి 34లక్షల 55వేల ఆదాయం 
  • వేగ నియంత్రణ పాటిస్తున్న వాహనదారులు 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్‌ గన్‌ ప్రయోగం ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రహదారులపై గంటకు 80కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు స్పీడ్‌ గన్‌ ద్వారా నమోదు చేసి జరిమానా విధిస్తుండడంతో వాహనదారులు వేగాన్ని తగ్గిస్తున్నారు. దీంతో ప్రమాదాల సంఖ్య గతంలో కంటే తగ్గింది. నేషనల్‌ హైవే -163(బీజాపూర్‌-హైదరాబాద్‌)పై గతేడాది 200లకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 100 ప్రమాదాలు జరిగాయి. సెప్టెంబర్‌లో మొదలైన ఈ ప్రక్రియ ద్వారా ఈ 9నెలల వ్యవధిలో 13వేల చలాన్లు జనరేట్‌ చేశారు. దీని ద్వారా రూ.కోటి 34లక్షల 55వేల ఆదాయం పోలీస్‌ శాఖకు లభించింది. 

పోలీస్‌ అకాడమీ నుంచి చేవెళ్ల ..

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జాతీయ రహదారులపై వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసు శాఖ స్పీడ్‌ గన్స్‌ను ప్రవేశపెట్టింది. సైబరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసు ఆధ్వర్యంలో రాజాబహదూర్‌ వెంకట రామిరెడ్డి పోలీస్‌ ఆకాడమీ (టీఎస్‌పీఏ) నుంచి చేవెళ్ల వరకు, నేషనల్‌ హైవే-163పై రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓవర్‌ స్పీడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వేగ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది భారీ రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

హైదరాబాద్‌ నుంచి బీజాపూర్‌ హైవేపై ట్రాఫిక్‌ పోలీసులు ఓవర్‌ స్పీడ్‌పై కన్నేయడంతో ఒకింత వాహనదారులు స్పీడ్‌ లిమిట్‌ను తగ్గించుకుని ప్రయాణిస్తున్నారు. టీఎస్‌పీఏ నుంచి మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌, మృగవని, రాణే ఇంజిన్‌ వాల్వ్స్‌, హిమాయత్‌నగర్‌, మొయినాబాద్‌, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, తోల్కట్ట, ముడిమ్యాల, మల్కాపూర్‌, కేసారం, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో ఈ స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేశారు. నేషనల్‌ హైవే-163పై గతేడాది 200లకుపైగా రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఈ ఏడాది ఇప్పటివరకు 100 ప్రమాదాలు జరిగాయి. మృతుల సంఖ్య చాలా వరకు తగ్గింది. పటిష్ట భద్రత చర్యల కారణంగా ప్రమాదాలు, నేరాలు, దోపిడీల శాతం తగ్గింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండడం, నిరంతరం పెట్రోలింగ్‌, జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణకు స్పీడ్‌ గన్‌ లేజర్‌లతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 

భారీగా జరిమానా విధింపు

ఓవర్‌ స్పీడ్‌కు రూ.1035 ఫైన్‌ వేస్తున్నారు. ఈ లెక్కన సెప్టెంబర్‌లో మొదలైన ఈ ప్రక్రియ ద్వారా ఈ 9నెలల వ్యవధిలో 13వేల చలాన్లు జనరేట్‌ చేశారు. దీంతో పోలీస్‌ శాఖకు రూ.కోటి 34లక్షల 55వేల ఆదాయం వచ్చింది.