ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - May 15, 2020 , 00:33:38

గోదాములతో రైతులకు మేలు

గోదాములతో రైతులకు మేలు

  • ధాన్యం నిల్వకు జిల్లాలో కొత్త గోడౌన్ల నిర్మాణం
  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
  • స్థానిక ఎమ్మెల్యేలతో స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ 
  • పూర్తి వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం
  • అంతారం, దొంతాన్‌పల్లి, కమ్మెట, కోహెడ, తుర్కయాంజాల్‌, ఆమనగల్లులో పర్యటన

షాబాద్‌: గోదాముల నిర్మాణాలతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం షాబాద్‌ మండలంలోని అంతారంలో సర్వేనంబర్‌ 118లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని చేవెళ్ల ఆర్డీఓ తిరుపతిరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, నిల్వ ఉంచేందుకు వీలుగా గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ సోలిపేట్‌ మహేందర్‌గౌడ్‌, వీఆర్వో కరుణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

దొంతాన్‌పల్లిలో.. 

శంకర్‌పల్లి రూరల్‌: మండలంలోని దొంతాన్‌పల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. సర్వే నంబర్‌ 197లో 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంలో ధాన్యం నిల్వ చేసేందుకు వీలుగా గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అశ్విని, సుధాకర్‌, పొడువు శ్రీనివాస్‌, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

కమ్మెటలో..

చేవెళ్ల: మండలంలోని ఎన్కెపల్లి, కమ్మెట, ఈర్లపల్లి గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి వీలుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో ప్రభుత్వం నూతనంగా గోదాములను నిర్మిస్తున్నదని కలెక్టర్‌ తెలిపారు. 

కోహెడ, తుర్కయాంజాల్‌లో..

హయత్‌నగర్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని కోహెడ, తుర్కయాంజాల్‌ గ్రామాల్లో వ్యవసాయ గోదాములు, కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, ఆర్డీఓ అమరేందర్‌, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గోదాముల సౌకర్యం కల్పించేందుకు, వాటి నిర్మాణం కోసం సుమారు 20 నుంచి 30 ఎకరాల అనువైన స్థలం కావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌, రెవెన్యూ అధికారులతో కలిసి కోహెడలోని సర్వే నంబర్‌ 167, తుర్కయాంజాల్‌లోని సర్వే నంబర్‌ 631లో ఉన్న ప్రభుత్వ భూములను వారు పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కందాడ ముత్యంరెడ్డి, తుర్కయాంజాల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ కొత్త రాంరెడ్డి,  డైరెక్టర్‌ సామ భీంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తి, నాయకులు పాల్గొన్నారు.

ఆమనగల్లులో రెండు గోదాములు..

ఆమనగల్లు: మండలంలో రెండు గోదాములు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని అదనపు కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మండలంలో ఆయన పర్యటించారు. చెన్నంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 23, ఆమగనల్లు పట్టణ సమీపంలో ముర్తుజాపల్లి గేట్‌ వద్ద సర్వే నంబర్‌ 117లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో స్థలాలను సర్వే నిర్వహించి నివేదికలు అందజేయాలని తహసీల్దార్‌ చందర్‌రావును ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, వీరయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, వీఆర్వోలు వెంకటేశ్‌, మాణిక్యరావు, సర్వేయర్‌ ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.

ఉమ్మడి నందిగామ మండలంలో.. 

నందిగామ: మండలంలోని చేగూరులో సర్వే నంబర్‌ 218లో, కొత్తూరు మండలం గూడూరులోన సర్వే నంబర్‌ 478లో ఉన్న ప్రభుత్వ భూములను గోదాముల నిర్మాణానికి ఆర్డీవో రాజేశ్వరి, కొత్తూరు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి పరిశీలించారు.   గోదాముల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, నందిగామ మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, బండోనిగూడ సర్పంచ్‌ జెట్ట కుమార్‌, రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.